2022లో పాపులర్ ఇండియన్ మూవీస్ ఇవే

ఈ ఏడాది దేశవ్యాప్తంగా వేలసంఖ్యలో సినిమాలు విడుదలయ్యాయి. ఒక్క తెలుగులోనే వందల సంఖ్యలో సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మరి ఈ వేల సినిమాల్లో మోస్ట్ పాపులర్ మూవీస్ ఏవి? ఎక్కువమంది ప్రేక్షకుల్ని మెప్పించిన సినిమాలేవి?…

ఈ ఏడాది దేశవ్యాప్తంగా వేలసంఖ్యలో సినిమాలు విడుదలయ్యాయి. ఒక్క తెలుగులోనే వందల సంఖ్యలో సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మరి ఈ వేల సినిమాల్లో మోస్ట్ పాపులర్ మూవీస్ ఏవి? ఎక్కువమంది ప్రేక్షకుల్ని మెప్పించిన సినిమాలేవి? దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అనుకుంటున్న కొన్ని సినిమాలకు టాప్-10లో చోటు దక్కిందా?

2022 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ జాబితాను విడుదల చేసింది IMDb. జనవరి 1 నుంచి నవంబర్ 7 మధ్య భారతదేశంలో థియేట్రికల్‌గా లేదా డిజిటల్‌గా విడుదలైన అన్ని సినిమాల్లో.. కనీసం పాతిక వేలు ఓట్ల సగటు కలిగి, IMDb వినియోగదారు రేటింగ్ 7 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న టాప్-10 సినిమాల్ని ఈ సంస్థ విడుదల చేసింది.

అలా ఈ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ మూవీ టాప్-1 పొజిషన్ లో నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకర్షించింది. నార్త్ బెల్ట్ లో ఈ సినిమా రన్ సంగతి పక్కనపెడితే.. ఉత్తరాది ప్రేక్షకులు చాలామంది ఈ సినిమా గురించి ఆరాలు తీశారు. ఇక దక్షిణాదిన ఈ సినిమా హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా IMDb వినియోగదారులు ఎక్కువమంది ఓటేసిన సినిమాగా, ఎక్కువ పేజ్ వ్యూస్ పొందిన సినిమాగా ఆర్ఆర్ఆర్ తొలిస్థానంలో నిలిచింది.

ఇక రెండో స్థానంలో కేజీఎఫ్-2 నిలుస్తుందని చాలామంది అంచనా వేయగా.. ఆ స్థానాన్ని ది కశ్మీర్ ఫైల్స్ ఎగరేసుకుపోయింది. కేజీఎఫ్-2కు యూజర్ రేటింగ్ ఎక్కువగానే ఉన్నప్పటికీ.. పేస్ వ్యూస్ పరంగా ది కశ్మీర్ ఫైల్స్ కు ఎక్కువ హిట్స్ ఉండడంతో.. సగటు ప్రాతిపదికన చూసుకున్నప్పుడు కశ్మీర్ ఫైల్స్ రెండో స్థానానికి ఎగబాకింది. కేజీఎఫ్-2కు మూడో స్థానం దక్కింది.

కమల్ నటించిన విక్రమ్ నాలుగో స్థానంలో.. రిషబ్ శెట్టి కాంతర ఐదో స్థానంలో నిలిచాయి. IMDb టాప్-10 మూవీస్ జాబితాలో సౌత్ డామినేషన్ స్పష్టంగా కనిపించింది.

1. ఆర్ఆర్ఆర్, 2. ది కశ్మీర్ ఫైల్స్, 3. కేజీఎఫ్ ఛాప్టర్-2, 4. విక్రమ్, 5. కాంతార, 6. రాకెట్రీ, 7. మేజర్, 8. సీతారామం, 9. పొన్నియన్ సెల్వన్-1, 10. 777 చార్లీ