వైసీపీ విస్మ‌ర‌ణ‌…కొంప ముంచ‌నుందా?

మ‌రో 16 నెలల్లో ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మున్ముందు రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు ఊపందుకోనున్నాయి. మ‌రోవైపు పార్టీ శ్రేణుల్ని ఎన్నిక‌ల స‌మ‌రానికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీలో వాలంట‌రీ వ్య‌వ‌స్థ‌ను…

మ‌రో 16 నెలల్లో ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మున్ముందు రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు ఊపందుకోనున్నాయి. మ‌రోవైపు పార్టీ శ్రేణుల్ని ఎన్నిక‌ల స‌మ‌రానికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీలో వాలంట‌రీ వ్య‌వ‌స్థ‌ను తెరపైకి తెస్తున్నారు. వారికి గృహ‌సార‌థుల‌నే చ‌క్క‌ని పేరు పెట్టారు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల గురించి విస్తృతంగా ప్ర‌చారం చేసి , మ‌రోసారి ప్ర‌జ‌ల ఆశీస్సులు పొంద‌డానికి ఈ వ్య‌వ‌స్థ ప‌నికొస్తుంద‌ని జ‌గ‌న్ భావ‌న‌.

న‌వ‌రత్నాల పేరుతో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు త‌ప్ప‌కుండా వైసీపీకి లాభం చేకూర్చుతాయి. అయితే జ‌గ‌న్ పాల‌న‌ను నాణేనికి రెండో వైపు కూడా చూడాల్సి వుంటుంది. ఉద్యోగ, నిరుద్యోగ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి, ఉన్న‌త వ‌ర్గాలు, విద్యావంతుల్లో మెజార్టీ చూస్తే  జ‌గ‌న్ ప‌రిపాల‌న‌పై అసంతృప్తిగా వుంది. వీళ్ల ఓట్ల‌ను వైసీపీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే… త‌మ ప‌రిపాల‌న 40 శాతం ప్ర‌జానీకానికి వ్య‌తిరేకంగా వుంద‌ని అధికార పార్టీనే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

ఈ ధోర‌ణి ప్ర‌మాద‌క‌రం. కేవ‌లం కొన్ని వ‌ర్గాల్ని మాత్ర‌మే న‌మ్ముకుని, మిగిలిన వారిని విస్మ‌రించ‌డం రాజ‌కీయ రంగంలో స‌రైన పంథా కాదు. ఈ విష‌యం జ‌గ‌న్‌కు తెలియ‌ద‌ని అనుకోవ‌డం అజ్ఞాన‌మే. అయితే వారి మెప్పు పొందే మార్గం జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌ద్ద లేద‌ని చెప్పొచ్చు. ఏపీ ఖ‌జానాలోని సొమ్మంతా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకే స‌రిపోతోంది. ఇంకా అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి. అలాంట‌ప్పుడు ఉద్యోగుల‌కు ఒక‌టో తారీఖున జీతాలు వేసే ప‌రిస్థితి ఎక్క‌డి నుంచి వ‌స్తుంది? అలాగే సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌కు ఖ‌ర్చు చేసే ప‌రిస్థితి లేదు.

ఉద్యోగుల భ‌ర్తీ చేయాలంటే ఆర్థిక ప‌రిస్థితి అనుకూలించేలా లేదు. అర‌కొరా ఉద్యోగాల భ‌ర్తీతో స‌రిపెట్టాల్సి వ‌స్తోంది. పేద‌ల‌కు ఇంటి స్థలాలు ఇచ్చారే త‌ప్ప‌, ఇళ్లు క‌ట్టుకోడానికి సాయం అందించే ప‌రిస్థితిలో ప్ర‌భుత్వం లేదు. ఎక్క‌డో కొన్ని చోట్ల మాత్ర‌మే ప‌క్కా గృహాల నిర్మాణం జ‌రుగుతోంది. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతో ప్ర‌భుత్వానికి సానుకూల‌త ఎంత వుందో, అదే రేంజ్‌లో వ్య‌తిరేక‌త కూడా పెరుగుతూ వ‌స్తోంద‌ని అధికార పార్టీ గ్ర‌హించాల్సి వుంటుంది.

వీటికి తోడు అధికారంలో వున్నా త‌మ‌కు ఎలాంటి ఆర్థిక ప్ర‌యోజ‌నాలు క‌ల‌గ‌లేద‌నే ఆవేద‌న‌, అసంతృప్తి వైసీపీ శ్రేణుల్లో వుంది. కేవ‌లం సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధితోనే స‌రిపెట్టుకోవాల‌ని చెబితే… ఇక పార్టీ కోసం ప్ర‌త్యేకంగా తామెందుకు క‌ష్ట‌ప‌డాల‌ని వారి నుంచి ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

ఈ నేప‌థ్యంలో క‌నీసం మిగిలిన ఏడాదిన్న‌ర పాల‌న‌లో అయినా అసంతృప్తుల‌ను త‌గ్గించుకోవాల్సిన అవ‌స‌రం వుంది. అప్పుడే పార్టీకి గెలుపు అవ‌కాశాలు మెరుగుప‌డుతాయి. అలా కాకుండా ఉద్యోగులు దూర‌మైతే ఏమ‌వుతుంది? నిరుద్యోగులు ఆద‌రించ‌క‌పోతే ఏమ‌వుతుంది? మ‌ధ్య‌త‌ర‌గ‌తి, ఉన్న‌త వ‌ర్గాల్లో కోపం వుంటే ఏం చేయ‌లేర‌ని అనుకుంటే…. చేసేదేమీలేదు. రెండు చేతులు క‌లిస్తేనే చ‌ప్పుడు అవుతుంది. ప్ర‌తి నీటి బిందువు క‌లిస్తేనే వ‌ర‌ద అవుతుంది. అదే స‌ముద్రం అవుతుంది. దేన్నైనా విస్మ‌రించ‌డం ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో మంచిది కాదు. ఈ వాస్త‌వాన్ని వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ గ్ర‌హిస్తే త‌న‌కే మంచిది.