భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇవాళ దేశ రాజధానిలో ఆ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ నేతృత్వం వహిస్తున్న బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్‌లో ఎలా అడుగు వేస్తుందని చర్చ జరుగుతోంది. మద్దతు అడిగితే తమ నాయకుడు వైఎస్ జగన్ అందరితో ఆలోచించి చెబుతారని ఇటీవల ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏపీలో బీఆర్ఎస్ ప్రవేశంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కేజ్రీవాల్ సారథ్యం వహిస్తున్న ఆప్‌తో కలిసి ఏపీలో కేసీఆర్ రాజకీయాలు స్టార్ట్ చేస్తారని ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల కేజ్రీవాల్‌తో కేసీఆర్ ఇదే విషయమై చర్చించినట్టు సమాచారం. కేజ్రీవాల్ పార్టీ ఆప్ ఇటీవల జాతీయ హోదాను సంతరించుకుంది. రానున్న రోజుల్లో ఆప్‌ను దేశ వ్యాప్తంగా విస్తరించాలని కేజ్రీవాల్ గట్టి పట్టుదలతో ఉన్నారు.
ఆప్‌న కు దేశ వ్యాప్తంగా క్రేజ్ వుంది. ముఖ్యంగా సుపరిపాలన అందిస్తున్న జాతీయ పార్టీగా యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యావంతులు, మేధావులు గుర్తిస్తున్నారు. మధ్య తరగతి, ఉన్నత వర్గాల్లో ఆప్‌పై ఆశలున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల ఏపీ విభజనకు కారణమైన నాయకుడిగా తనను చూసే అవకాశం వుండదని కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలిసింది.
కేసీఆర్‌తో కలిసి రాజకీయ ప్రయాణం సాగించడానికి కేజ్రీవాల్ కూడా సిద్ధంగా ఉన్నారని సమాచారం. దీంతో రానున్న రోజుల్లో ఆప్, బీఆర్ఎస్ కలిసి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.