13 ఏళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసిన చిత్రం అవతార్. జేంస్ క్యామరూన్ దర్శకుడు. దానికి ముందు అతను తీసిన సినిమా టైటానిక్. అంటే ఆ రెండు సినిమాలకి 12 ఏళ్ల గ్యాప్ అన్నమాట.
ఇలా పుష్కరానికొక సినిమాకి దర్శకత్వం వహిస్తున్నా ప్రపంచం దృష్టి మొత్తాన్ని తన వైపుకు తిప్పుకునేలా చేస్తున్నాడు.
అయితే 1997లో టైటానిక్ ఒక అద్భుతం. ఒక ఓడ సముద్రంలో మునగడం అంతకంటే గొప్పగా సినిమాల్లో ఎవరూ చూడలేదు.
అవతార్ నాటికి ఒక కాల్పనిక గ్రహంలోని జీవులు, వాటి ఎకో సిస్టం తెరకెక్కించి ఔరా అనిపించడం మరొక అద్భుతం. అలాంటి విచిత్రమైన రూపాలు హాలీవుడ్ తెర మీద ఎవరూ చూసుండలేదు.
ఇప్పుడు అలా “ఔరా” అనిపించే అంశం లేదు. ఎందుకంటే 13 ఏళ్ల క్రితం చూసేసిన అద్భుతం ఇప్పుడు మళ్లీ అద్భుతమెందుకవుతుంది? కనుక కథనం, భావోద్వేగాలు, కొన్ని మొమెంట్స్ బలంగా ఉండాలి. అప్పుడే ఈ చిత్రం ఆశించిన ఫలితం పొందే అవకాశముంటుంది.
ఆశించిన ఫలితమంటే కనీసం రూ 16,500 కోట్లు వసూలు చెయ్యాలట. అప్పుడే పెట్టుబడి వెనక్కి వస్తుందట. ఈ మాట సాక్షాత్తు జేంస్ క్యామరూనే చెప్పాడు.
రమారమి ఈ సినిమా తీయడానికి పెట్టిన పెట్టుబడి రూ 2900 కోట్ల నుంచి రూ 3300 కోట్ల వరకు ఉంటుందని అని అంచనా. కనుక 16,500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ చేస్తే తప్ప ఇతర ఖర్చులన్నీ పోను పెట్టుబడి వెనక్కి రాదు.
గతంలోకి చూస్తే అవతార్ దాదాపు 2.9 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. అప్పటి డాలర్ విలువ రూ50/- కాస్త అటుఇటుగా ఉండేది. అదే ఇప్పటి లెక్కతో పోలిస్తే రూ80 చొప్పున లెక్కేసుకున్నా రూ 24,000 కోట్లు వసూలు చేసినట్టన్నమాట. అదే వసూళ్లు ఈ పార్ట్ 2 కూడా రాబట్టగలిగితే అద్భుతం మళ్లీ జరిగినట్టే.
అయితే 2009 నాటికి ఓటీటీలు లేవు. స్మార్ట్ ఫోన్స్ కూడా అందరికీ చేరువ కాలేదు. ఇంటెర్నెట్టున్నా ఇప్పుడున్నంత స్పీడ్ అప్పుడు లేదు. కనుక అవతార్ ని హాలుకొచ్చే చూసారు.
కాని ఇప్పుడు ఒక సినిమా చూడాలంటే రకరకాల మార్గాలున్నాయి. హాలుకెళ్లడం బద్ధకమైనప్పుడు కాస్త ఓపిక పడితే నెలా, రెండు నెలల్లో ఓటీటీలోకొచ్చెస్తున్నాయి సినిమాలు. ఈ లోపు ప్రత్యామ్నాయ వినోదం బోలెడంత ఉంటోంది. కనుక హాలుకెళ్లి సినిమా చూడకపోతే కొంపలు మునిగిపోతాయన్న భావన సినీ అభిమానుల్లో కూడా తగ్గుముఖం పట్టింది.
ఈ నేపథ్యంలో అవతార్ 2 అప్పడు చేసినంత కలెక్షన్ చేస్తుందా అంటే వేచి చూడాలి.
ఒక మాస్ హిస్టీరియాలాగ పట్టేసి, ఇరుగు పొరుగు అందరూ అవతార్2 గురించి చర్చించుకుని వేలంవెర్రిగా చూస్తే తప్ప సాధ్యం కాదు.
ఇంతకీ ఈ సినిమా నిడివి 3 గంటల 10 నిమిషాలట.
పండోరా అనబడే ఒక కాల్పనిక గ్రహవాసులకు, మరొక తెగకు మధ్యన జరిగే ఆధిపత్య పోరు మొదలైన ఎమోషన్స్ చుట్టూ సాగుతుంది కథ. అలాగే భూలోకానికి, ఈ కథకి కూడా ప్రత్యక్ష సంబంధం ఉండనే ఉంటుంది. అది అవతార్ మొదటి భాగం చూసిన వాళ్లకి తెలిసిందే.
డిసెంబర్ 16 న విడుదలవుతున్న ఈ చిత్రం ఒక్క భారతదేశంలోనే ఇంగ్లీష్, హింది, తెలుగు, కన్నడ, మలయాళ, తెలుగు భాషల్లో వస్తోంది. ఇక ఇతర ప్రపంచ భాషల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మల్టీప్లెక్సుల్లో దుమ్ము దులిపేసింది. కంటెంట్ బాగుందని టాక్ వస్తే దీని స్థాయి వేరే లెవెల్లో ఉంటుందన్నది నిర్వివాదాంశం.
2022 ముగింపులో ఇంత పెద్ద సినిమా యొక్క భవితవ్యం ఎలా ఉండబోతోందో చూద్దాం.