వీళ్లా జ‌గ‌న్‌కు ప్ర‌త్యామ్నాయం!

జ‌న‌సేన పార్టీని స్థాపించి తొమ్మిదేళ్లు అవుతోంది. ఇంత వ‌ర‌కూ సంస్థాగ‌త నిర్మాణం లేక‌పోవ‌డం, ఆ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ సీరియ‌స్‌నెస్ తెలియ‌జేస్తోంది. ప‌వ‌న్‌ను పార్ట్‌టైమ్ పొలిటీషియ‌న్‌, ప్యాకేజీ స్టార్ అని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తే, జ‌న‌సేన…

జ‌న‌సేన పార్టీని స్థాపించి తొమ్మిదేళ్లు అవుతోంది. ఇంత వ‌ర‌కూ సంస్థాగ‌త నిర్మాణం లేక‌పోవ‌డం, ఆ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ సీరియ‌స్‌నెస్ తెలియ‌జేస్తోంది. ప‌వ‌న్‌ను పార్ట్‌టైమ్ పొలిటీషియ‌న్‌, ప్యాకేజీ స్టార్ అని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తే, జ‌న‌సేన శ్రేణుల‌కు కోపం రావ‌చ్చు. కానీ వాస్త‌వాలు మాట్లాడుకోవాల్సి వ‌స్తే, ప‌వ‌న్ సీరియ‌స్‌గా రాజ‌కీయాలు చేసిందెన్న‌డు?

తాజాగా ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు, ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను ఎదిరించేందుకు విజ‌య‌ద‌శ‌మి నుంచి ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల యాత్ర చేస్తార‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డాన్ని అంద‌రూ ఆహ్వానిస్తారు. ఇదే సమ‌యంలో ప్ర‌త్యామ్నాయంగా ఎవ‌రిని ఎన్నుకోవాలి? ఇప్ప‌టికీ త‌మ‌ను గెలిపించాల‌ని జ‌న‌సేన కోర‌లేని దుస్థితి.

పార్టీ నిర్మాణం ఎంత ఘోరంగా ఉందో నాదెండ్ల మ‌నోహ‌రే చెప్పారు. ‘జూలై నాటికి గ్రామ కమిటీలు, పట్టణ, వార్డు స్థాయి కమిటీలు ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. రాష్ట్రంలో జనసేన క్రియాశీల సభ్యత్వం మూడు లక్షలకు చేరింది’ అని నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలిపారు. 

దివంగ‌త ఎన్టీఆర్ పార్టీని స్థాపించి తొమ్మిది నెల‌ల్లో అధికారంలోకి వ‌చ్చి రికార్డు సృష్టించారు. అలాగే వైఎస్ జ‌గ‌న్ పార్టీ స్థాపించి మూడేళ్ల‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా చిన్న వ‌య‌సులోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. 8 ఏళ్ల‌కు ఆయ‌న అధికారం లోకి వ‌చ్చారు. మ‌రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేస్తున్న‌దేంటి?  చేసిందేంటి? ఇంకా జూలై నాటికి గ్రామ‌, ప‌ట్ట‌ణ‌, వార్డుస్థాయి క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ఆదేశిస్తున్నారంటే, రాజ‌కీయాలంటే జ‌న‌సేనానికి ఎంత నిర్ల‌క్ష్య‌మో అర్థం చేసుకోవ‌చ్చు.

టీడీపీ బ‌ల‌మే త‌న బ‌ల‌మ‌ని భావిస్తున్న‌ట్టున్నారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లో తాను త‌గ్గాన‌ని, ఇప్పుడు టీడీపీ కొంచెం త‌గ్గి త‌న‌కు సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని ఆయ‌న కోరుకుంటున్నారు. క‌నీసం గ్రామ‌, వార్డు స్థాయి క‌మిటీలు వేసుకునే దిక్కు లేని పార్టీ ఏమ‌ని పొత్తు కోసం వెంప‌ర్లాడుతోంది? కేవ‌లం ఒక సామాజిక వ‌ర్గం త‌న వెంట ఉంటుంద‌నే న‌మ్మ‌కంతో రాజ‌కీయాలు చేస్తున్నార‌నే అనుమానం క‌లుగుతోంది. 

జ‌గ‌న్‌రెడ్డికి మ‌రోసారి ఓటు వేయ‌కూడ‌ద‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకున్నార‌ని, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఓటు వేయ‌డానికి 70 శాతం ప్ర‌జ‌లు ఎప్పుడో నిర్ణ‌యించుకున్నార‌ని స‌ర్వేలో తేలింద‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్ చెప్పారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు, జ‌న‌సేన‌కు ఓట్లు వేయాల‌ని ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌ర్వేలో తేలిందా? అస‌లు మీ పార్టీని జ‌నం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్నారా? ఏం ఆశించి ప‌వ‌న్‌క‌ల్యాణ్ యాత్ర స్టార్ట్ చేయాల‌ని భావిస్తున్నారో స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. ఇలాంటి వాళ్లంతా జ‌గ‌న్‌కు ప్ర‌త్యామ్నాయం అవుతారా?