మహానాడు తర్వాత టీడీపీ జోష్ మీద ఉన్నట్టు కనిపించింది. అయితే వైసీపీ గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు వెళుతూ, మూడేళ్ల పాలనలో ఏఏ కుటుంబానికి ఎంతెంత డబ్బు అందిందో లెక్కలతో సహా చేతికి పత్రాలు అందిస్తూ, మరోసారి ఆశీర్వదించాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో అది కాదని చెప్పి, ప్రజల్లోకి వెళ్లే సాహసం టీడీపీ చేయలేకపోతోంది.
ప్రజల వద్దకు వెళుతున్న వైసీపీ ప్రజాప్రతినిధులపై ప్రజలు తిరగబడుతున్నారని టీడీపీ నేతలు, ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ, తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
అక్కడక్కడ ఎమ్మెల్యేలను ప్రజాసమస్యలపై నిలదీస్తూ వుండొచ్చు. వారంతా గతంలో వైసీపీకి ఓటు వేశారనే నమ్మకం ఏంటి? అధికార పార్టీ గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లను దక్కించుకుంది. మిగిలిన 50 శాతం ప్రతిపక్ష పార్టీలకు వెళ్లిందనే వాస్తవాన్ని విస్మరించకూడదు. అలాంటి వాళ్లంతా ప్రభుత్వంపై, అధికార పార్టీ నేతలపై అక్కసుతో ఉండడం సహజమే.
తన మ్యానిఫెస్టోను మూడేళ్లలో 95 శాతం అమలు చేసినట్టు ప్రభుత్వం ధైర్యంగా చెబుతోంది. కాదని విమర్శించే వాళ్లకు దమ్ముంటే ప్రజల మధ్యే చర్చకు రావాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు సవాల్ విసురుతున్నారు.
జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని నమ్ముతున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన తదితర పార్టీలన్నీ సవాల్‌ను ఎందుకు స్వీకరించడం లేదు? ఆరోపణల్లో నిజం ఉందని నమ్ముతుంటే నడిబజార్‌లో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్ని ఏకిపారేసే అవకాశాన్ని ఎందుకు జారవిడుచుకుంటున్నారో అర్థం కాదు. బాదుడే బాదుడు, మహానాడు కార్యక్రమాల తర్వాత మళ్లీ మీడియా రచ్చకే టీడీపీ పరిమితం కావడం గమనార్హం.
సర్వేలు చేసి, ప్రజాదరణ కలిగిన నేతలకే టికెట్ ఇస్తామని చంద్రబాబు చెబితే…. అమ్మో అని పార్టీ నేతలంతా భయపడ్డారు. తీరా డోన్ అభ్యర్థిగా సుబ్బారెడ్డి ఎంపికతో బాబు మాటలన్నీ ఉత్తుత్తిదే అని టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. అలాగే రాయలసీమలో రాజకీయాలు విరమించిన నేతలందర్నీ తిరిగి దగ్గరకు తీసుకుంటున్నారంటే, బాబు ఎంత వెనకబడి ఉన్నారో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జగన్ ఆదేశాలతో వైసీపీ ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల మధ్య వుంటుంటే, టీడీపీ నేతలు మాత్రం ఎల్లో చానళ్లలో ప్రత్యక్షమవుతున్నారు. ఇదే తేడా, ఇలాగైతే పార్టీ బతికి బట్ట కట్టేదెట్టా?
ముందు చంద్రబాబు తనయుడు సోషల్ మీడియా మత్తు నుంచి బయటికొస్తే తప్ప చాలా వాటికి పరిష్కారం దొరకదు. లోకేశే ప్రజల్లోకి వెళ్లకపోతే మిగిలిన వారు ధైర్యంగా ఎలా వెళ్తారు? ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే అంశాలపై టీడీపీ పెద్దలు మార్గనిర్దేశం చేస్తే, మిగిలిన వారు అందుకుంటారు. అదెక్కడా కనిపించడం లేదు.
ఈ నెల 15 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. కానీ ప్రజల వద్దకు నేరుగా వెళ్లే దారేది? అనేదే ఇప్పుడు ప్రశ్న. ఆ విషయమై టీడీపీ పెద్దలు సీరియస్‌గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.