పవర్ స్టార్ పవన్ కు కాస్త షార్ట్ టెర్మ్ మెమరీ లాస్ అన్నట్లు వుంటుంది. సినిమాలు తనంతట తానే మానేసా అని మరిచిపోతారు. తాను సినిమాలు చేయడం తప్పా అని ఎదురు ప్రశ్నిస్తారు.
తెలంగాణలో పార్టీ వ్యవహారాలు కూడా అంతే. ఈ మధ్యనే తెలంగాణలో ఓ చిన్న ట్రిప్ వేసి, ఇక్కడ కూడా పోటీ చేస్తామని, పొత్తులు ఎవరితో అన్నది త్వరలో డిసైడ్ చేస్తామని అన్నారు.
అక్కడ కూడా అదే మెమరీ ప్రోబ్లమ్…ఇప్పటికే భాజపాతో తన పార్టీకి పొత్తు వుందని మరిచినట్లుంది. సరే కేసిఆర్ పార్టీకి భాజపాకు ఉప్పు నిప్పు కాబట్టి ఇలా అని వుండొచ్చు.
ఇప్పుడు ఆంధ్రలో ఆర్నెల్లు ఎన్నికల టూర్ ప్రారంభిస్తున్నారు. వచ్చే ఏడాదిలోనే ఎన్నికలు వస్తాయని పవన్ పార్టీ జనసేన డిసైడ్ అయిపోయింది.
సరే, నిజమే అనుకుందాం. మరి తెలంగాణ సంగతేమిటి? ఆంధ్ర కన్నా ముందుగా ఎన్నికలు రావాలి కదా? 2023లో తెలంగాణ ఎన్నికలు పక్కా అనుకుంటే మరి పవన్ ముందుగా ప్లాన్ చేసుకోవాల్సింది తెలంగాణ గురించి కదా?.
గతంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తాం అని బీరాలు పలికి మళ్లీ కన్వీనియెంట్ గా మరచిపోయారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు ముందుగా వస్తాయన్న టాక్ వుంటే, ఆంధ్రలో యాత్రకు స్వీకారం చుట్టారు.
నిజానికి పవన్ యాత్ర గురించి రాజకీయ వర్గాల్లో ముందుగానే వినిపించింది. రెండేళ్లు ఎన్నికలు వున్నాయనగా ముందుగా పవన్, ఆ తరువాత లోకేష్, ఆపై చంద్రబాబు ఎన్నికల పర్యటనలు చేసేలా తెలుగుదేశం ఎన్నికల వ్యూహ విభాగం ప్రణాళిక రచించిందని వినిపిస్తూ వస్తోంది.
ఇప్పుడు అదే నిజం అవుతోంది. పవన్ ముందుగా ప్రారంభిస్తున్నారు. ఆ తరువాతే లోకేష్. జనసేన కు బలమైన ఏరియాల్లో పవన్ తిరుగుతారు. ఉత్తరాంధ్ర ఏరియా మీద లోకేష్ ఫోకస్ పెడతారు. ఫైనల్ గా చంద్రబాబు ఫినిషింగ్ టచ్ ఇస్తారు.
అప్పటి వరకు పొత్తుల గురించి మాట్లాడరు. అప్పుడు అసలు విషయం ప్రకటిస్తారు. అదే జరిగేది.