దేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. దీనికి అనేక కారణాలు. బొగ్గు సరఫరా లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇందుకు ఆంధ్రప్రదేశ్ మినహాయింపు కాదు. కానీ ఎల్లో బ్యాచ్ తీరు చూస్తుంటే కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే విద్యుత్ సమస్య అన్నట్టు విమర్శలున్నాయి. దీనికి తానా అంటే తందానా అనే ఎల్లో మీడియా ఉంది.
దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమైనా అది జగన్ పాలనా వైఫల్యమని సూత్రీకరించే మేధావులు, ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ సమాజం పాలిట శాపంగా తయారయ్యారు. రానున్న రోజుల్లో విద్యుత్ కోతల సంగతేమో గానీ, ఎల్లో బ్యాచ్ జగన్ ప్రభుత్వంపై కోతలు హద్దులు దాటుతున్నాయనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ కోతలపై జగన్ ప్రభుత్వం అప్రమత్తం చేయడమే నేరమైంది.
విద్యుత్ కోతల సాకుతో వైసీపీ రెబల్ ఎంపీ కోతలు కోయడం బ్రహ్మానందం కామెడీని తలపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ పరిపాలన, అవగాహన లోపంతోనే ఏపీలో విద్యుత్ సమస్య ఏర్పడిందని ఢిల్లీ వేదికగా ఆయన కోతలు కోస్తున్నారు.
రాష్ట్రంలో అకస్మాత్తుగా ఇప్పుడెందుకు విద్యుత్ కోతలు విధించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. సౌర విద్యుత్‌ను నమ్ముకొని థర్మల్ విద్యుత్‌ని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.
పంజాబ్, గుజరాత్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో విద్యుత్ కోతలకు కూడా జగన్ పాలన, అవగాహన లోపమని అర్థం చేసుకోవాలేమో. కాసేపటి క్రితం విద్యుత్ సమస్యపై కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన ఆయన చూసినట్టు లేరు.
విద్యుత్ కోతల కంటే తన కోతలే ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఎక్కువ ప్రమాదమని సదరు ఎంపీ గారు గుర్తిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.