పిల్లలకు కరోనా టీకా లేదనే బెంగ తీరనుంది. పిల్లలకు, వారి యోగక్షేమాలను కోరుకునే తల్లిదండ్రులకు తీపి కబురు చెప్పింది. 2-18 ఏళ్ల మధ్య వయసున్న వారికి కోవాగ్జిన్ టీకా ఇచ్చేందుకు అన్ని స్థాయిల్లో ప్రయోగాలు విజయవంతమయ్యాయి. దీంతో చిన్నారులకు టీకా ఇచ్చేందుకు నిపుణుల కమిటీ ఆమోదం తెలిపినట్టు కేంద్రం వెల్లడించింది.
ఇప్పటికీ కరోనాను పారదోలేందుకు పూర్తిస్థాయిలో టీకా రాలేదు. కేవలం రక్షణ కవచంగా మాత్రమే టీకాలు పని చేస్తున్నాయి. టీకాలు వేయించుకున్న వాళ్లు కూడా కరోనాబారిన పడడం తెలిసిందే. అయితే టీకా వేయించుకున్న వాళ్లపై మహమ్మారి ప్రభావం తక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే చిన్నారులకు టీకా లేకపోవడంపై తల్లిదండ్రులు, పౌర సమాజం ఆందోళనగా ఉంది.
కరోనా బారిన పడ్డ చిన్నారులకు మాత్రం టీకా వేసేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. ఈ నేపథ్యంలో పలు ఫార్మసీ సంస్థలు చిన్నారులకు టీకా తయారీలో తలమునకలయ్యాయి. భారత్ బయోటెక్ చిన్నారుల కోసం ప్రత్యేకంగా కోవాగ్జిన్ టీకా తయారీలో ముందడుగు వేసింది.
ఇటీవల ఆ సంస్థ కీలక ప్రయోగాలు కూడా చేసింది. 2 నుంచి 18ఏళ్ల వారి కోసం కోవాగ్జిన్ టీకా 2, 3 దశల ప్రయోగాలను గత నెలలో భారత్ బయోటెక్ పూర్తి చేసింది. అనంతరం సంబంధిత నివేదికను భారత ఔషధ నియంత్రణ సంస్థకు(డీసీజీఐ) అందజేసింది. ఈ నివేదికను పరిశీలించిన డీసీజీఐ నిపుణుల కమిటీ.. పిల్లలకు కొవాగ్జిన్ టీకా ఇచ్చేలా అత్యవసర అనుమతులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేసినట్లు సమాచారం.
ఇక కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పచ్చ జెండా ఊపడమే తరువాయని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో చిన్నారులకు టీకా వేస్తున్నారు. కానీ మన దేశంలో పెద్దలకు కూడా పూర్తిస్థాయిలో టీకా అందించలేని పరిస్థితి. ఇదిలా ఉండగా పిల్లలకు రెండు డోసుల టీకాను వేయనున్నట్టు సమాచారం. అది కూడా 20 రోజుల వ్యవధిలోనే కావడం గమనార్హం.