రాబోయే రోజుల్లో కరెంట్ కష్టాలు తప్పేలా లేవు. ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి లేకపోవడంతో ఆందోళన నెలకుంది. ముఖ్యంగా బొగ్గు సరఫరా ఆగిపోవడంతో కరెంట్ కోత కష్టాలను ముందే గ్రహించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కరెంట్ కొరత ఏ స్థాయిలో ఉండనుందో ప్రధానికి సీఎం రాసిన లేఖ ప్రతిబింబించింది. కరెంట్ పొదుపు చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న చేసిన విన్నపం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కరెంట్ కొరతపై కీలక ప్రకటన చేసింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వరుసగా విద్యుత్ సమస్యపై ఏదో ఒక రూపంలో మాట్లాడుతుండడంతో తీవ్ర ప్రమాదం పొంచి ఉందనే భయాందోళన సామాన్య జనంలో నెలకుంది.
ప్రజల అవసరాల కోసం తమ వద్ద ఉన్న ‘కేటాయించని విద్యుత్’ను వాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విన్నవించింది. అలాగే హెచ్చరిక కూడా చేయడాన్ని గుర్తించుకోవాలి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలోని సారాంశం గురించి తెలుసుకుందాం.
‘విద్యుత్ కేటాయింపుల మార్గదర్శకాల ప్రకారం.. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల వద్ద 15శాతం విద్యుత్‌ను ఏ రాష్ట్రాలను కేటాయించకుండా ఉంచుతారు. అత్యవసర విద్యుత్ అవసరాలనున్న రాష్ట్రాలకు కేంద్రం దీన్ని కేటాయిస్తుంది. అలాంటి ఇబ్బంది ఉన్న రాష్ట్రాలు ఆ ‘కేటాయించని విద్యుత్’ను ఉపయోగించుకోవాలి. తద్వారా తమ ప్రజలకు కరెంట్ సరఫరా చేయాలి. ఏ రాష్ట్రం వద్దైనా మిగులు విద్యుత్ ఉంటే కేంద్రానికి తెలియజేయాలి. ఆ విద్యుత్‌ను కరెంట్ అవసరమున్న రాష్ట్రాలకు కేటాయించేందుకు వీలుంటుంది’ అని పేర్కొంది.
అలాగే కొన్ని రాష్ట్రాలు తమ వినియోగదారులకు కరెంట్ సరఫరా చేయడం లేదని తమ దృష్టికి వచ్చినట్టు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ తెలిపింది. అంతేకాకుండా అధిక ధరలకు విద్యుత్‌ను విక్రయిస్తున్నట్టు తెలిపింది. తమ సొంత వినియోగదారులకు కరెంట్ సరఫరా చేయకుండా విద్యుత్‌ను విక్రయించకూడదని హెచ్చరించడం గమనార్హం.
కరెంట్‌ను అధిక ధరకు విక్రయించే రాష్ట్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. ప్రతిదీ కరెంట్‌పై ఆధారపడి వ్యవస్థ నడుస్తోంది. ఒకవేళ విద్యుత్ వ్యవస్థ కూలిపోతే ఆ ప్రమాదాన్ని ఊహించడం కష్టం. మానవాళిలో విద్యుత్ కొరత చీకట్లు నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది కరోనాకు మరో రూపమని భావించొచ్చు.