సమంత, నాగచైతన్య విడాకులు ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక అప్ డేట్ మాత్రమే! విడాకులు తీసుకోవడం అనేది సెలబ్రిటీల విషయంలో చాలా కామన్ గా వినిపించే వార్త. సినిమా వాళ్లు, క్రికెటర్లు, ఇతర రంగాల్లో పేరు ప్రఖ్యాతులు పొందే వాళ్ల విడాకుల వ్యవహారాలు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. వారి పెళ్లిళ్ల గురించి ఎన్ని వార్తలు వస్తాయో, విడాకుల గురించి అంతకు మించి వార్తలు వస్తూ ఉంటాయి.
బాలీవుడ్ తో మొదలుపెడితే, స్టార్ హీరోలతో మొదలుపెడితే, చోటామోటా సెలబ్రిటీలు కూడా విడాకులతో వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. హాలీవుడ్, టాలీవుడ్ ఏదీ దీనికి మినహాయింపు కాదు.
ఆర్థిక స్వతంత్రమే కారణమా?
స్త్రీకి అయినా, పురుషుడికి అయినా ఆర్థిక స్వతంత్రం ఉంటే జీవితంపై చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది తాము సొంతంగా సంపాదించుకున్నది అయినా, తాతలు సంపాదించి పెట్టింది అయినా ఆర్థికశక్తి అనేది ఉంటే వారికి బోలెడంత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఏ వ్యవహారాన్ని అయినా వారు డీల్ చేసే విధానం వేరేలా ఉంటుంది! అదే వివాహానికి కూడా వర్తిస్తోందా? అనేది ప్రధానంగా జరగాల్సిన చర్చ.
డబ్బున్నోళ్లు అంతా విడాకులు తీసుకుంటున్నారా, లేక డబ్బు లేని వాళ్లు విడిపోవడం లేదా..అనే ప్రశ్నలూ కీలకమైనవే. డబ్బున్నోళ్లంతా విడాకులు తీసుకోకపోవచ్చు. దాంపత్యబంధంలో పొరపచ్చలు వచ్చినప్పుడు వ్యవహరించే తీరు వేరేగా ఉంటుంది. ఆర్థిక స్వతంత్రం లేని వారు.. వివిధ కారణాలతో రాజీ పడి బతకొచ్చు! అయితే.. ఆర్థిక స్వతంత్రం ఉంటే.. రాజీ పడటం అనే ముచ్చట క్రమంగా తగ్గుతుంది. ఈ తగ్గడం ఒక్కోరి దాంపత్యంలో ఒక్కో స్థాయిలో ఉండొచ్చు. ఇది పూర్తిగా తగ్గిపోయినప్పుడే.. విడాకుల వరకూ వ్యవహారం రావొచ్చు!
ఇతరుల పట్ల ఆకర్షణ!
ఇది కలగని మానవుడు ఉండదు. ఎంత పెళ్లి అయినా.. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు అయినా.. పరస్పర ఇష్టం ఎంత ఉన్నా… వివాహం తర్వాత కలలో అయినా పరస్త్రీని తలవని పురుషుడు ఎక్కడ ఉంటాడో చెప్పడం కష్టం. అలాంటి ప్రవరాఖ్యుడిని పట్టుకోవడం చాలా కష్టం.
భార్య ఎంత బాగా చూసుకున్నా, తన శ్రద్ధనంతా భర్త మీదే పెట్టినా… మగాడికి వేరే పరిచయాలు వేరే ఆలోచనలను కలగకుండా ఆపవు. అయితే అందరు మగాళ్లూ అలాంటి తప్పులు చేస్తారని అనలేం. అయితే అవకాశాలను బట్టి ప్రవర్తించే మగాళ్లే ఎక్కువ అని వేరే చెప్పనక్కర్లేదు. అదే స్త్రీ కోణం నుంచి పరాయి ఆకర్షణల అంశాన్ని పరిశీలిస్తే… పురుషుడు నిర్లక్ష్యం చేసినప్పుడే ఈ ధోరణి కొంత వరకూ ఉంటుంది.
సంపాదన వేటలో కావొచ్చు, వేరే రీజన్లతో కావొచ్చు, ఆమెకు తగిన గౌరవం, మర్యాద ఇవ్వకపోవడం, ఆమెను మనిషిలా చూడకపోవడం, లేదా స్వతంత్రాన్ని పూర్తి హరించి వేయడం, ఆమె కెరీర్, చదువు, ఉద్యోగం వంటి వాటికి కాస్తంత ప్రాధాన్యత అయినా ఇవ్వకపోవడం.ఈ విషయాల్లో మారాలనే ఒత్తిళ్లు వంటివి ఆమెను నిస్తేజానికి గురి చేయవచ్చు. ఈ నిస్తేజంలో ఉన్నప్పుడు వేరే పరిచయాలు వేరే బంధానికి సులభంగా దారి తీస్తాయి!
ఇగో వార్!
ఇది మొదలైందంటే బంధంలో ప్రశాంతత దాదాపుగా కరువైనట్టే. నువ్వెంత? అనే ఫీలింగ్ ఇరువురిలోనూ పనికి వచ్చేది కాదు. ఇద్దరూ సంపాదిస్తున్నప్పుడు, లేదా ఒకరు మాత్రమే సంపాదిస్తున్నప్పుడు ప్రాథమిక విజ్ఞతను మరిచిపోతే ఇగో వార్ ముదిరే అవకాశం ఉంది.
ఇద్దరూ సమ స్థాయిలో సంపాదిస్తున్నా ఆడ ప్రాధాన్యత ఆడదానిది, మగవాడి ప్రాధాన్యత మగవాడిది! లేదా తన భార్య ఉద్యోగం చేయలేకపోతోందని, వంటింటి కుందేలని ఆమెను తక్కవ చేసి మాట్లాడి, అడుగడుగునా అవమానించే తత్వం మగాళ్లలో ఉంటుంది. అయితే తమ భార్య ఇంటికి పరిమితమై వంట చేసి పెడితే చాలని కోరుకునే వాళ్లూ ఉంటారు.
ఎవరికి కావాల్సినట్టుగా వాళ్లే దక్కితే ఫర్వాలేదు. అటు ఇటైనప్పుడే ఈ రచ్చ సాగుతూ ఉంటుంది. ఇక స్త్రీ బయటకు వెళ్లి సంపాదించాలి, ఇంట్లోనూ పనులన్నీ చేసేయాలనే మగ దురహంకారం కూడా రాజ్యం ఏలుతూ ఉంటుంది. అయితే అవతలి వారు రాజీ పడిబతికినన్ని రోజులు మాత్రమే ఈ దురహాంకారం చెల్లుబాటు అవుతుంది. ఆమె అభద్రతాభావంలో ఉంటేనే ఇలాంటి వారి ఆటలు చెల్లుబాటు అవుతాయి.
పరస్పరం బోర్ కొట్టడం!
ఇది ఎవరికి అయినా జరుగుతుంది. భార్యకు భర్త బోర్ కొట్టవచ్చు, భర్త కు భార్య కొట్టవచ్చు. సుదీర్ఘ దాంపత్య బంధంలో నిత్యనూతన ఆకర్షణను కలిగి ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా ఆ ప్రేమను శాశ్వతంగా కలిగి ఉండటం తేలికేమీ కాదు. ఇక అరేంజ్డ్ పెళ్లిళ్లలో ఈ బోర్ కొట్టే దాఖలాలు మరింత ఎక్కువ! శారీరకంగా కావొచ్చు, మానసికంగా కావొచ్చు.. ఒకరంటే మరొకరికి అనాసక్తి కలగడం సహజమే.
సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో అయితే.. ఇలాంటి సందర్భాల్లో వేరే విషయాలు డ్యామినేట్ చేస్తాయి. పిల్లలు, ఆర్థిక పరిస్థితులు, బయటి వాళ్లు ఏమైనా అనుకుంటారు.. అనే లెక్కలన్నీ కలిసి ఎంత బోర్ డమ్ లో అయినా వైవాహిక బంధాన్ని కొనసాగించే పరిస్థితిని తప్పనిసరిగా కల్పిస్తాయి.
అయితే హయ్యర్ క్లాస్ లో ఈ బోర్ డమ్ చాలా తేలికగా రావొచ్చు! అందుకే ఎంగేజ్ మెంట్ చేసుకున్నాకా కూడా ఈ క్లాస్ లో క్యాన్సిల్ చేసుకునే అవకాశాలుంటాయి. ఎంగేజ్ మెంట్ కూ, పెళ్లికి మధ్యలో ఐదారు నెలలు వచ్చిందన్నా పెళ్లి అయిన ఐదారు నెలల్లోనే విడాకులు తీసుకునే వారు ఆర్థికంగా శక్తివంతమైన కుటుంబాల్లోనే ఎక్కువ. సమాజానికో, పరిస్థితులకో భయపడి రాజీ పడాల్సిన అవసరం వీరికి ఉండదు. అందుకే చాలా సులువుగా వేరు పడటం సాధ్యం అవుతుందని వేరే చెప్పనక్కర్లేదు.