పాద‌యాత్ర గాలికొదిలేసి…ఇదేం న‌ట‌న‌!

అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి కొత్త నాట‌కానికి తెర‌లేపింది. పాద‌యాత్ర‌ను అర్ధంత‌రంగా నిలిపేసి ధ‌ర్నాలంటూ డ్రామాలు చేస్తోంద‌న్న విమ‌ర్శ‌ల‌ను మూట‌క‌ట్టుకుంటోంది. ఏపీ హైకోర్టుకెళ్లి మ‌రీ అనుమ‌తి తెచ్చుకున్న అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి ఆగిపోయిన పాద‌యాత్ర‌ను ఎప్పుడు…

అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి కొత్త నాట‌కానికి తెర‌లేపింది. పాద‌యాత్ర‌ను అర్ధంత‌రంగా నిలిపేసి ధ‌ర్నాలంటూ డ్రామాలు చేస్తోంద‌న్న విమ‌ర్శ‌ల‌ను మూట‌క‌ట్టుకుంటోంది. ఏపీ హైకోర్టుకెళ్లి మ‌రీ అనుమ‌తి తెచ్చుకున్న అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి ఆగిపోయిన పాద‌యాత్ర‌ను ఎప్పుడు ప్రారంభిస్తుందో చెప్ప‌డం లేదు.

అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ కోస‌మంటూ అర‌స‌వెల్లి వర‌కూ రెండో విడ‌త పాద‌యాత్ర చేప‌ట్టారు. అమ‌రావ‌తినే ఏకైక రాజ‌ధానిగా కొన‌సాగించాలంటూ వివిధ రూపాల్లో రైతుల పేరుతో  నిర‌స‌న తెలిపారు. తిరుప‌తి వ‌ర‌కూ మొద‌టి విడ‌త పాద‌యాత్ర‌ను పూర్తి చేశారు. అమ‌రావ‌తికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన త‌ర్వాత కూడా పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. ఎగ్జిక్యూటివ్ రాజ‌ధానిగా విశాఖ వ‌ద్దంటూ ఉత్త‌రాంధ్ర‌కు పాద‌యాత్ర చేప‌ట్ట‌డానికి ఎంత ధైర్య‌మ‌ని అక్క‌డి ప్ర‌జానీకం నిల‌దీసింది.

పాద‌యాత్రగా వ‌స్తే మాత్రం అడ్డుకుని తీరుతామ‌ని ఉత్త‌రాంధ్ర‌, దాని స‌మీప కోస్తా స‌మాజం తీవ్ర హెచ్చ‌రిక జారీ చేసింది. అయిన‌ప్ప‌టికీ మొండిగా, దురుసుగా ఉత్త‌రాంధ్ర‌కు పాద‌యాత్ర‌గా బ‌య‌ల్దేరారు. అడుగ‌డుగునా వారికి ప్ర‌జ‌ల నుంచి అడ్డంకులు ఎదుర‌య్యాయి. నియంతృత్వ పోక‌డ‌లు, రెచ్చ‌గొట్టే విధానాల‌తో వెళుతున్న పాద‌యాత్రికుల‌కు మున్ముందు ఏం జ‌ర‌గ‌బోతుందో జ్ఞానోద‌యం అయ్యింది. దీంతో పాద‌యాత్ర‌ను ప్ర‌భుత్వం అణ‌చివేస్తోంద‌ని మ‌ళ్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు.

పాద‌యాత్ర‌కు అనుమ‌తి పొందిన 600 మంది త‌మ గుర్తింపుకార్డుల‌ను చూపి, పాద‌యాత్ర‌ను చేసుకోవ‌చ్చ‌ని ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తిని హైకోర్టు ఇచ్చింది. అయితే పాద‌యాత్రపై అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితిలోనే విభేదాలు త‌లెత్తిన‌ట్టు స‌మాచారం. కేవ‌లం కొంత మంది ఆర్థిక ప్ర‌యోజ‌నాల కోసం అమ‌రావ‌తిని వాడుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీంతో పాద‌యాత్ర ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా త‌యారైంది. పాద‌యాత్ర ఊసే లేకుండా పోయింది.

ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి తాజాగా త‌న ఉనికి చాటుకునేందుకు అన్న‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న చేసింది. ఏపీ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న చేసి మూడేళ్లు అవుతున్న సంద‌ర్భంగా ఈ నెల 17, 18, 19 తేదీల్లో ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నాతో పాటు వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ఆ సంస్థ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు శివారెడ్డి, గ‌ద్దె తిరుప‌తి రావు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. 

ఇవ‌న్నీ స‌రే, ఇంత‌కూ రెండో విడ‌త పాద‌యాత్ర‌కు దారేది? చెప్పండి గురూ! అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఏంటి? ఎవ‌రి కోసం, ఎందుకోసం పాద‌యాత్ర‌ను నిలిపారో స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి నేత‌ల‌కు వుంది.