ష‌ర్మిలకు గ్రీన్ సిగ్న‌ల్‌…కండీష‌న్స్ అప్లై!

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల పాద‌యాత్ర‌కు తెలంగాణ హైకోర్టు మ‌రోసారి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అనుమ‌తి ఇస్తూనే… ష‌ర్మిల‌కు ష‌ర‌తులు కూడా విధించ‌డం గ‌మ‌నార్హం. అయితే పాద‌యాత్ర‌కు మాత్రం మార్గం సుగుమ‌మైంది. వ‌రంగ‌ల్ జిల్లాలో…

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల పాద‌యాత్ర‌కు తెలంగాణ హైకోర్టు మ‌రోసారి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అనుమ‌తి ఇస్తూనే… ష‌ర్మిల‌కు ష‌ర‌తులు కూడా విధించ‌డం గ‌మ‌నార్హం. అయితే పాద‌యాత్ర‌కు మాత్రం మార్గం సుగుమ‌మైంది. వ‌రంగ‌ల్ జిల్లాలో ష‌ర్మిల పాద‌యాత్ర‌ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌త నెల‌లో పాద‌యాత్ర‌కు సంబంధించి వాహ‌నాల‌ను టీఆర్ఎస్ శ్రేణులు ధ్వంసం చేశారు. ప్లెక్సీలు, బ్యాన‌ర్ల‌ను త‌గుల‌బెట్టారు.

ఆ త‌ర్వాత అనేక రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. పాద‌యాత్ర‌కు హైకోర్టు అనుమ‌తి ఇచ్చినా వ‌రంగ‌ల్ పోలీసులు మాత్రం ససేమిరా అన్నారు. దీంతో ఆమె నిర‌శ‌న‌కు దిగారు. ష‌ర్మిల ఆమ‌ర‌ణ దీక్ష‌ను పోలీసులు భ‌గ్నం చేసి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స అనంత‌రం ఆమె డిశ్చార్జి అయ్యారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి ఆమె పాద‌యాత్ర‌కు అనుమ‌తి కోరుతూ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు.

ష‌ర్మిల పిటిష‌న్‌పై ఇవాళ మ‌ధ్యాహ్నం హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా కీల‌క ఆదేశాలు ఇచ్చింది. ష‌ర్మిల పాద‌యాత్ర‌కు అనుమ‌తి ఇస్తూనే, కండీష‌న్స్ అప్లై అవుతాయ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం, సీఎం కేసీఆర్‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని న్యాయ స్థానం స్ప‌ష్టం చేసింది. రాజ‌కీయ విమ‌ర్శ‌లు త‌ప్ప‌, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు చోటు లేద‌ని హైకోర్టు తేల్చి చెప్పింది.

పాద‌యాత్ర‌కు అనుమ‌తి ఇచ్చినా ఆదేశాలు పాటించ‌ని వ‌రంగ‌ల్ సీపీపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ష‌ర్మిల పాద‌యాత్ర‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని వ‌రంగ‌ల్ సీపీని న్యాయ స్థానం ఆదేశించ‌డం విశేషం. అయితే కోర్టు విధించిన ష‌ర‌తుల‌ను ష‌ర్మిల ఎంత వ‌ర‌కూ పాటిస్తుంద‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆమె మాట తీరు వ‌ల్లే పాద‌యాత్ర‌కు అడ్డంకులు ఎదుర‌వుతున్న‌ట్టు టీఆర్ఎస్ నేత‌లు ఇప్ప‌టికే చెప్పిన సంగ‌తి తెలిసిందే.