ఉన్మాది ప్రేమికుడు. తన ప్రేమ అంగీకరించలేదని ప్రేయసిని కత్తితో పొడిచాడు. అడ్డొచ్చిన తల్లిని కూడా పొడిచాడు. తర్వాత తను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. హైదరాబాద్ లోని మియాపూర్ లో జరిగింది ఈ ఘటన
గుంటూరుకు చెందిన 19 ఏళ్ల యువతి తన తల్లితో కలిసి మియాపూర్ లో ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన సందీప్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మూడేళ్లుగా చాలా క్లోజ్ గా ఉన్నారు. అయితే ఉన్నట్టుండి యువతి, సందీప్ ను దూరం పెట్టింది.
దాదాపు ఏడాదిన్నర నుంచి సందీప్ కు దూరంగా ఉంటోంది బాధిత యువతి. దీన్ని సందీప్ భరించలేకపోయాడు. తన నంబర్ బ్లాక్ చేసినప్పటికీ రకరకాల ఫోన్ నంబర్ల నుంచి కాల్ చేసి వేధించడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో అతడి బెదిరింపులు పతాకస్థాయికి చేరాయి. కొన్ని రోజులుగా కొన్ని సిమ్ కార్డుల నుంచి కాల్ చేస్తున్న సందీప్, సదరు యువతిని చంపేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. అవసరమైతే తను కూడా ఆత్మహత్య చేసుకుంటానంటూ మెసేజీలు కూడా పంపించసాగాడు.
చివరికి ఈరోజు అన్నంతపని చేశాడు. యువతి ఇంటికొచ్చిన సందీప్, తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచాడు. అడ్డొచ్చిన తల్లిని కూడా పొడిచాడు. ఆ తర్వాత అతడు కూడా అత్మహత్యకు యత్నించాడు.
వెంటనే స్పందించిన స్థానికులు యువతినిని, ఆమె తల్లి శోభను ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. సందీప్ కు లోతైన గాయాలు కావడంతో, అతడ్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.