అరుణాచల్ ప్రదేశ్ పరిధిలోని తవాంగ్ సెక్టార్ లో భారత, చైనా సైనికుల మధ్యన జరిగిన ఘర్షణ గురించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రకటన చేసింది. ఈ అంశంపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ… ఈ నెల తొమ్మిదో తేదీన తవాంగ్ లో ఘర్షణ నిజమే అని తెలిపారు. ఈ ఘటనలో ఇరువైపులా సైనికులెవ్వరూ మృతిచెందలేదని రాజ్ నాథ్ ప్రకటించారు. అయితే కొందరు స్వల్ప గాయాలపాలయినట్టుగా కేంద్రమంత్రి వివరణ ఇచ్చారు.
ఇటు భారత సైన్యానికి సంబంధించి, అటు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కి సంబంధించి.. ఇరు వర్గాల సైనికులకూ గాయాలయినట్టుగా ఈ కేంద్రమంత్రి ప్రకటించారు. ఇండియా, చైనాల సరిహద్దుల్లో ఇలాంటి ఘర్షణలు కొత్తవి కావని వేరే చెప్పనక్కర్లేదు.
ఆయుధాలు ప్రయోగించకుండా, పేలుడు పదార్థాల వాడకం లేకుండా.. ఘర్షణాత్మకరీతిలో ఇరు వర్గాలూ పలుసార్లు పోరాడాయి. దాదాపు మూడేళ్ల కిందట లఢాక్ పరిధిలోని సరిహద్దుల్లో కూడా ఇలాంటి తీవ్రమైన ఘర్షణ జరిగింది.
ఆయుధాలు లేకుండా, ముళ్ల కర్రలతో కొట్టుకుని, తోసుకుని, పరస్పరం దాడులు చేసుకుని అప్పుడు ఇండియా, చైనా సైనికులు తలపడ్డారు. ఆ ఘర్షణలో ఇరు వర్గాలకు సంబంధించిన వారు కూడా మరణించారు. భారత సైనికుల మరణానికి సంబంధించి అధికారిక ప్రకటనలు రాగా, చైనా మాత్రం తమకు జరిగిన నష్టం గురించి తనదైన రీతిలో దాచి పెట్టింది. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో అలాంటి వివాదమే రేగింది.