చిరంజీవి, బాలకృష్ణ.. ఇద్దరూ టాలీవుడ్ సీనియర్ హీరోలు. ఒకప్పుడు బాక్సాఫీస్ వార్ లో సై అంటే సై అంటూ రంకెలేసిన స్టార్లు. కలెక్షన్లు, రికార్డుల పరంగా ఇద్దరూ హేమాహేమీలు. ఇప్పటికీ వీళ్లకు టాలీవుడ్ లో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. అదిరిపోయే మార్కెట్ కూడా ఉంది. వీళ్ల సినిమాలకు కళ్లుచెదిరే ఓపెనింగ్స్ వస్తాయి.
ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఇప్పుడీ ఇద్దరు హీరోల్లో చిరంజీవి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. చిరంజీవికి ఇప్పటికీ మార్కెట్లో తిరుగులేని స్థానం ఉంది. ఆయన స్టార్ డమ్ ఆయనకే సొంతం. టాలీవుడ్ మెగాస్టార్ ఆయన. ఆయన స్థాయి వేరు. మరి ఇలాంటి హీరో ఎందుకు మరో హీరోపై ఆధారపడే పరిస్థితికి వచ్చారు?
గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ తో స్పెషల్ రోల్ వేయించారు చిరంజీవి. అంతకంటే ముందు ఆచార్యలో ఓ కీలక పాత్ర కోసం రామ్ చరణ్ ను తీసుకున్నారు. ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయిన వాల్తేరు వీరయ్యలో రవితేజను ఓ ప్రత్యేక పాత్ర కోసం తీసుకున్నారు.
నిజానికి ఇవి ప్రత్యేక పాత్రలో, అతిథి పాత్రలో ఎంతమాత్రం కావు. గెస్ట్ రోల్స్ కు మించిన రోల్స్ ఇవి. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాల్ని మల్టీస్టారర్ మూవీస్ గా చెప్పుకోవచ్చు. టాలీవుడ్ లో భారీ మార్కెట్ కలిగిన చిరంజీవి, ఎందుకిలా మరో హీరోతో కలిసి సినిమాలు చేస్తున్నారు? ఏరికోరి అలాంటి కథలే ఎందుకు ఎంచుకుంటున్నారు? ఇది మార్కెట్ ను నిలుపుకునే ప్రయత్నమా? లేక పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నమా?
అసలు చిరంజీవి ఫిల్మోగ్రఫీలో ఇలా బ్యాక్ టు బ్యాక్ ఈ తరహా సినిమాలు పడడం కాకతాళీయమా? లేక కావాలనే చిరంజీవి ఇలా సెట్ చేసుకున్నారా? ఈ ప్రశ్నలకు ఎన్నో జవాబులు ఉండొచ్చు కానీ, ఇప్పుడు మాత్రం అన్ని వేళ్లు చిరు వైపే చూపిస్తున్నాయి. దీనికి కారణం మరోసారి చిరంజీవి, బాలయ్య సినిమాతో బాక్సాఫీస్ బరిలో తలపడ్డానికి రెడీ అవ్వడమే!
ఇప్పటివరకు ఒకెత్తు.. ఇప్పట్నుంచి మరో లెక్క
ఇన్నాళ్లూ చిరంజీవి Vs బాలకృష్ణ అన్నట్టు ఉండేది వార్. తమతమ సినిమాల్లో చిరంజీవి, బాలయ్య మాత్రమే కనిపించేవారు. ఒంటి చేత్తో సినిమాను నిలబెట్టేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. బాలయ్య సినిమా వీరసింహారెడ్డిలో ఆయన మాత్రమే స్పెషల్ ఎట్రాక్షన్. కానీ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్యలో చిరుతో పాటు రవితేజ కూడా కనిపిస్తున్నాడు. సినిమాలో రవితేజకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారనేది తాజాగా రిలీజైన టీజర్ చూస్తే తెలుస్తుంది. దీంతో బాలయ్యను ఎదుర్కొనేందుకు చిరంజీవి, రవితేజను తోడుగా తీసుకొస్తున్నారనే సందేశం జనాల్లోకి వెళ్లిపోయింది.
సంక్రాంతి బరిలో బాలయ్య గెలిచినా, చిరంజీవి గెలిచినా.. అది చిరంజీవికే ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాలయ్య గెలిస్తే.. రవితేజను వెంటబెట్టుకొని మరీ బాలయ్యపై పైచేయి సాధించలేకపోయారనే అపవాదు వస్తుంది. ఒకవేళ చిరంజీవి గెలిచినా, రవితేజ సహాయంతో బాలయ్యపై పైచేయి సాధించారనే విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇన్నాళ్లూ రామ్ చరణ్, సల్మాన్ లాంటి హీరోలతో నటించినా చర్చకు రాని పాయింట్, ఇప్పుడు రవితేజతో చిరంజీవి నటించినప్పుడు చర్చకు వచ్చిదంటే కారణం, బాలయ్య సినిమాతో చిరంజీవి సినిమా పోటీకి దిగడమే. ఇప్పటికీ అందరి డౌట్ ఒక్కటే.. బాలకృష్ణకు లేని ప్యాడింగ్ చిరంజీవికి అవసరమా? చిరంజీవికి ఏం తక్కువ?