ఒకవైపు ఇండియన్ కరెన్సీపై మహాత్మా గాంధీ బొమ్మ ఎందుకు? అంటూ కొంతమంది మేధావులు ప్రశ్నిస్తూ ఉన్నారు. గాంధీని చంపిన గాడ్సేనే మహాత్ముడు అంటూ కీర్తిస్తూ ఉన్నారు. గాడ్సే గురించి వీరగాథలు పాడటం లేటెస్ట్ ఫ్యాషన్. అలా మాట్లాడితే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బోనస్!
దేశంలో యువత ఎలా ఉందంటే.. సైన్యానికి కొత్త ఆయుధాలు వచ్చాయంటే సోషల్ మీడియాలో సంబరం చేసుకునేంత! గాడ్సే ను కీర్తించేంత! సైన్యానికి కొత్త ఆయుధాలు కొనడం అవసరమే కావొచ్చు, కానీ యువత దృష్టి ఆయుధాల మీద పడటం అంత మంచి పరిణామం ఏమీ కాదు. బహుశా అది రాజకీయ నేతల అవసరం. భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే యత్నం.
ఇలాంటి పరిస్థితుల్లో గాంధీ ఏం చేశాడు? నెహ్రూ ఏం పొడిచాడు? అనే వాళ్లు చాలా మంది తయారైపోయారు. అలా మాట్లాడటం గొప్ప అయిపోయిందిప్పుడు. వీళ్ల చర్చ ప్రస్తుతం మీద ఉండదు, ప్రస్తుతం ఏం జరుగుతోందో అవసరం లేదు, దాని మీద అవగాహన కూడా ఉండదు, గాంధీ ఏం చేయలేదు, నెహ్రూ తప్పు చేశాడు అంటూ మాత్రం సులువుగా తేల్చేస్తారు. వాస్తవాలను ఒప్పుకోలేని తత్వం.
ఇలా ఇండియాలో గాంధేయవాదాన్ని చులకన చేయడం ఒక ఫ్యాషన్ మారిన తరుణంలో బ్రిటన్ ఒక ఆసక్తిదాయకమైన నిర్ణయాన్ని తీసుకుంది. గాంధీ బొమ్మను తమ దేశ కరెన్సీ మీదకు తీసుకొస్తోంది. గాంధీ బొమ్మతో కరెన్సీ కాయిన్స్ ను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు బ్రిటీషర్లు. బ్రిటన్ కరెన్సీ మీద తొలిసారి ఒక ఏసియన్, ఒక నల్ల జాతీయుడి బొమ్మ పడుతోందని అక్కడి వారు చెబుతున్నారు. మొత్తానికి ఇండియాలో రేపోమాపో గాంధీ బొమ్మను కరెన్సీ మీద తీసేసినా తీయగలరేమో, ఇలాంటి తరుణంలో బ్రిటీషర్లు గాంధీని తమ కరెన్సీ మీదకు ఎక్కిస్తున్నారు.