తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్‌ని ఆయన నివాసంలో ఆదివారం కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కలిశారు. ఇటీవల కరోనా నియంత్రణలో తెలంగాణ సర్కార్‌పై విఫలమైందంటూ పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలు అయిన విషయం తెలిసిందే.
ఈ కేసుల విచారణలో భాగంగా హైకోర్టు తీవ్రంగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ప్రజల ప్రాణాలను ప్రభుత్వం గాలికి వదిలేసిందంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఉన్నత వైద్యాధికారులను కూడా పిలుపించుకుని తమ ఆదేశాలను ఎందుకు పాటించడం లేదో చెప్పాలని హైకోర్టు నిలదీసింది. ప్రస్తుతం హైకోర్టులో కరోనాపై విచారణ సాగుతోంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కేవలం మర్యాద పూర్వకంగా కిషన్‌రెడ్డి కలిశారని సమాచారం. కిషన్‌రెడ్డి పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉంటారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరిని కూడా కిషన్‌రెడ్డి ఆదివారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా వాళ్లిద్దరి మధ్య మూడు రాజధానుల విషయమై చర్చ జరిగినట్టు తెలిసింది. ఇటీవల రాజధాని అమరావతిని అంగుళం కూడా కదిలించలేరని, కేంద్రం తగిన సమయంలో జోక్యం చేసుకుంటుందని సుజనా చౌదరి చెప్పడాన్ని ఏపీ బీజేపీ తప్పు పట్టింది. ఈ మేరకు వెల్లడించిన ట్వీట్‌లో అది సుజనా చౌదరి వ్యక్తిగత అభిప్రాయమంటూ తేల్చి చెప్పింది. దీంతో ఆయన మౌనం పాటించారు.