ఒక్కోసారి అంతే..టైమ్ బాగా లేకపోతే,అన్ని వైపుల నుంచి ఒకేసారి వత్తిడులు, దాడులు ప్రారంభమవుతాయి. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వ్యవహారం అలాగే వుంది ఇప్పుడు. పాపం, దారుణమైన పరాజయం తప్పలేదు. సరే,రాజకీయాల్లో ఇది కామన్ అని సర్ది చెప్పుకుని, పోరుబాటలో సాగుదాం అనుకునేసరికి కరోనా వచ్చింది. దాంతో ఇంట్లో కూర్చునే జూమ్ మీటంగ్ లతో సరిపెట్టుకుందాం అనుకునేసరికి, ఫిరాయింపులు మొదలయ్యాయి. మరోపక్క చేసిన పాత తప్పుల కారణంగా కొందరు నేతలు జైలు పాలయ్యారు. ఇలా అన్ని విధాలా ఎన్ని సమస్యలు వస్తున్నా తట్టుకోగలరు చంద్రబాబు. కానీ మీడియా అండ వుండాలి. తెలంగాణలో అది లేకనే ఒక్క రాష్ట్రానికి పరిమితమైన జాతీయ పార్టీగా మిగిలిపోయింది.
ఇప్పుడు పాపం కరోనా వచ్చి తెలుగునాట కూడా చంద్రబాబుకు మీడియా సపోర్టు లేకుండా చేసేసింది. లేదూ అంటే పార్టీకి అవసరమైన ఈ విపత్కరవేళ లక్షల కాపీలు కొట్టి జనాలకు పంచేసేవారు. విషాదం ఏమిటంటే కరోనా వేళ బాబు అనుకూల మీడియాకు ఆయన అండ లేకుండా పోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితి బాబు గారు కనుక అధికారంలో వుండి వుంటే విపరీతంగా ప్రకటనలు కుమ్మేసేవారు. నష్టం అనేది గుమ్మంలోకి రాకుండా చేసేవారు.
అప్పుడు స్టాఫ్ ను తగ్గించాల్సిన పని వుండేది కాదు. నష్టాలు ఎదుర్కోనే పని వుండేది కాదు. పోనీ బాబుగారు అధికారంలో లేరు. కరోనా రాకుండా వుంటే మీడియా బలంగా వుండి వుండేది. దాని తోడు దొరికేది. కానీ ఇప్పుడు అదీ లేదు. ఇరవై కాపీలకు తక్కువగా సర్కులేషన్ వుండే పల్లెలకు ఓ ప్రధాన దినపత్రిక వెళ్లడం లేదు. మరో దినపత్రిక అంతంతమాత్రం ప్రింట్ చేస్తోంది. న్యూస్ ప్రింట్ సమస్య, ప్రకటనలు లేకుండా విచ్చలవిడిగా కొడితే నష్టాలు తప్ప లాభం వుండదు. దీంతో ప్రింట్ ఆర్డర్ తగ్గించుకుంటున్నాయి.
అందువల్ల ఏముంది? బాబు గారికి మద్దతుగా ఆయన అనుకూల మీడియా ఎంత గొంతు చించుకున్నా అది జనాలకు చేరడం లేదు. తెలంగాణలో బాబుగారికి మద్దతుగా మాట్లాడలేరు. ఆంధ్రలో మాట్లాడినా జనాలకు చేరదు. మీడియా బలం లేకపోతే, బాబుగారు నీళ్లలోంచి తీసి ఒడ్డున పడేసిన చేప. ఇది నిజంగా కలవరం కలిగించే విషయం. మీడియా అండ లేకనే తెలంగాణలో పూర్తిగా పార్టీ అనేది నేలబారుకు వచ్చేసింది.
ఇప్పుడు ఆంధ్రలో మీడియా కరోనా తరువాత పుంజుకుంటే ఫరవాలేదు. లేదూ, ఇప్పటి పరిస్థితులే కొనసాగితే, జనాలకు పేపర్ చదవడం అలవాటు తప్పిపోయి, టీవీలతో సరిపెట్టుకుంటే మాత్రం చాలా కష్టంగా వుంటుంది. కరోనా కల్లోలం కనుక మీడియాను ఎన్నాళ్లు వెంటాడితే, బాబుగారికి అంత కష్టం. ఈ కల్లోలం ముగిసే లోగా జగన్ తన పనులు తాను చక్కబెట్టేస్తున్నారు.