అనేక నాటకీయ పరిణామాల మధ్య ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. గత మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా జగన్ సర్కార్, నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మధ్య విభేదాలకు దారి తీసింది. ఇరువైపులా పంతాలు , పట్టింపులకు పోవడంతో సమస్య జటిలమైంది. ఇటు ఏపీ సర్కార్, అటు నిమ్మగడ్డ వైపు నుంచి కూడా కావాల్సినన్ని తప్పులు జరిగాయి.
అప్పుడప్పుడే కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థలను ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆరు వారాల పాటు వాయిదా వేశారు. ఎన్నికల వాయిదా వేయడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట మాత్రంగా కూడా సంప్రదించకుండా నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. నిమ్మగడ్డ ఒంటెత్తు పోకడలపై నిరసన వ్యక్తం చేసే హక్కు సీఎంకు ఉంది. దీన్ని ఎవరూ కాదనలేరు. అయితే ఇదే సందర్భంలో సీఎం కాస్తా సంయమనం కోల్పోయి నిమ్మగడ్డ కులం గురించి మాట్లాడ్డం విమర్శలకు దారి తీసింది.
ఇటు నిమ్మగడ్డ, అటు ప్రభుత్వం తమ తప్పులు లేదా పొరపాట్లను మొగ్గదశలోనే తుంచి వేసి ఉంటే అసలు సమస్యే ఉండేది కాదు. కానీ తెగే వరకు ఇరువైపులా లాగారు. దీంతో ఇరువైపులా ప్రతిష్టకు పోయి తమ పదవులకు మచ్చ తెచ్చారనే చెప్పాలి. అదెలాగంటే రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ నిమ్మగడ్డ కేంద్రహోంశాఖకు ఐదు పేజీల లేఖ రాయడం…ఓ రాజ్యాంగం పదవిలో ఉన్న వ్యక్తి చేయాల్సిన పని ఎంత మాత్రం కాదు.
పైగా ఈ లేఖను తన సామాజికవర్గం చేతుల్లో ఉన్న చానళ్లకు అందజేసి…రాజకీయ రచ్చకు కారణమయ్యారు. పైగా ఈ లేఖ తానే రాసేనని మాట మాత్రం కూడా చెప్పక పోవడం మరో తప్పు. పైగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లేఖపై అనుమానాలున్నాయని, ఎక్కడ తయారైందో నిగ్గు తేల్చాలని డీజీపీకి ఫిర్యాదు చేసిన తర్వాతే….నిమ్మగడ్డ స్పందించారు. తానే ఆ లేఖ రాశానని ప్రకటించడం గమనార్హం. సీఐడీ విచారణలో ఆ లేఖ ఎస్ఈసీ కార్యాలయంలో తయారు కాలేదని తేలింది. అంతేకాదు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు, ఈ లేఖ తయారీకి సంబంధం ఉన్నట్టు నిగ్గు తేల్చారు.
ఇక ప్రభుత్వ వైపు నుంచి చూస్తే తక్కువ తప్పులేం చేయలేదు. పంచాయతీరాజ్ చట్టంలో సంస్కరణల పేరుతో కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డను అర్ధాంతరంగా తొలగించారు. ఈ వ్యవహారం చివరికి కోర్టు ధిక్కరణ వరకు దారి తీసింది. జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేయడంతో సమస్యకు ముగింపు వస్తుందని అందరూ భావించారు. చివరికి ఎస్ఈసీ వ్యవహారం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. అక్కడ కూడా ఏపీ సర్కార్‌కు చుక్కెదురైంది. మధ్యలో గవర్నర్ కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఇలా అనేక నాటకీయ పరిణామాల మధ్య సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీ సర్కార్ ఎట్టకేలకు ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పునర్నియామకానికి ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ సోమవారం విజయవాడలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ అని అభిప్రాయపడ్డారు. రాగద్వేషాలకు అతీతంగా ఎస్ఈసీ పని చేస్తుందని ఆయన అన్నారు.
తాను బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్ ద్వారా జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. గతంలో మాదిరిగానే ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందని ఆశిస్తున్నట్టు నిమ్మగడ్డ తెలిపారు. గతంలో ప్రభుత్వం, నిమ్మగడ్డ మధ్య ఏం జరిగినా….ప్రస్తుతం ఆయన హూందాగా మాట్లాడారు.
నిమ్మగడ్డ తిరిగి ఎస్ఈసీగా బాధ్యతలు చేపడుతారని తెలిసినప్పటి నుంచి అందర్లో ఒకటే అనుమానం…ప్రభుత్వంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. నిమ్మగడ్డ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మాట్లాడినట్టు రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వర్తించి పోయిన పరువును నిలబెట్టుకునే అవకాశం ఉంది. అలాగే గతంలో మాదిరిగానే నిమ్మగడ్డకు ప్రభుత్వం సహకారం అందించి పెద్దరికాన్ని చాటుకోవాలి. ఆ దిశగా ప్రయాణించి ఆదర్శంగా నిలుస్తారని ఆశిద్దాం.