మాజీ సిఎమ్ చంద్రబాబునాయుడుకు ఓ స్ట్రాటజీ వుంది. ఏ నాయకుడి మీద విమర్శలు చేయాలన్నా, ఏ విషయం మీద విమర్శలు చేయాలన్నా కులం కార్డు వాడడం. రెడ్డిని విమర్శించాలంటే తన పార్టీలో వున్న రెడ్లను ముందుకు తోస్తారు. కాపు అంటే కాపును ముందుకు నప్పుతారు. ఇలా వాళ్లలో వాళ్లకే ముళ్లు పెట్టడం అనేది ఆ స్ట్రాటజీ.
ఇప్పడు ఇదే స్ట్రాటజీని అమరావతి కొసం కూడా వాడుతున్నట్లు కనిపిస్తోంది. అమరావతి గురించి గట్టిగా మాట్లాడాలి అంటే కృష్ణ, గుంటూరు జిల్లాల వారే మాట్లాడాలి. కానీ వారు మాట్లాడితే మిగిలిన 11 జిల్లాల జనాలకు సెంటిమెంట్ రాజుకుంటుంది. అమరావతి కోసం ఈ 11 జిల్లాలను దూరం చేసుకోవాల్సి వుంటుంది.
అందుకే మళ్లీ తన స్టయిల్ ప్లాన్ కు తెరతీసారు. రాయలసీమకు చెందిన బీటెక్ రవి అనే నాయకుడిని తెరపైకి తెచ్చారు. ఆయన చేత అమరావతికి అనుకూలంగా స్టేట్ మెంట్ లు ఇప్పిస్తున్నారు. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన అయ్యన్నపాత్రుడును వాడుతున్నారు. అంటే ఉత్తరాంధ్రకు రాజధాని వద్దని ఉత్తరాంధ్ర వాళ్ల చేత, రాయలసీమకు న్యాయ రాజథాని వద్దని సీమ వాళ్ల చేత చెప్పించడం అన్నమాట.
కానీ ఈ దిక్కుమాలిన స్ట్రాటజీ ఇప్పుడు చెల్లదు. అయ్యన్న చెప్పినంత మాత్రాన ఉత్తరాంధ్ర జనాలకు రాజధాని వద్దు అనుకునేంత అమాయకులు కారు. బిటెక్ రవి చెప్పినంత మాత్రాన సీమ జనాలు నమ్మరు. కానీ ఇలా వీళ్ల చేత మాట్లాడిస్తూ, బాబుగారు తన స్ట్రాటజీ వాడారు అని మురిసిపోతున్నారు. కానీ వీళ్లు తెలుగుదేశం పార్టీ వాళ్లు అని జనాలు గుర్తు పెట్టుకుంటారు. ఆ విషయం గమనించాలి.