ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. మూడు రాజధానుల అంశంపై ప్రజాభిప్రాయం కోరుదామని, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామని బాబు డిమాండ్ చేశారు. తన సవాల్‌పై స్పందించేందుకు జగన్‌కు 48 గంటల సమయం కూడా ఇచ్చారు.
హైదరాబాద్ నుంచి మీడియాతో ఆయన సోమవారం సాయంత్రం ఐదు గంటలకు మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా అమరావతికి వైఎస్ జగన్ మద్దతు ఇచ్చారన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పాడని మండిపడ్డారు. రాజధాని అమరావతి నుంచి మారుస్తామని వైసీపీ మ్యానిఫెస్టోలో పెట్టలేదని చంద్రబాబు అన్నారు. మ్యానిఫెస్టో తనకు బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని జగన్ చెబుతారని, అలాంటి పవిత్ర గ్రంథంలా భావించే మ్యానిఫెస్టోపై ఏ మాత్రం గౌరవం ఉన్నా రాజధాని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మూడు రాజధానులను ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని బాబు ప్రశ్నించారు. రాజధాని మారుస్తూ ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ముఖ్యమంత్రి జగన్ వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. తన ఆవేదనను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని బాబు కోరారు. ఇది కులాలు, మతాల సమస్య కాదన్నారు. తాము రాజీనామా చేయడం పెద్ద విషయం కాదని బాబు అన్నారు. కానీ తమ 23 మంది సభ్యులు రాజీనామా చేయాలని వైసీపీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఒకవేళ ఎన్నికల్లో తిరిగి జగన్‌ను ఎన్నుకుంటే తనకెలాంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.