మీడియం హీరోలతో సూపర్ హిట్ లు ఇచ్చి, సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేసే లెవెల్ ఎదిగాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కానీ కరోనా వచ్చి మొత్తం ప్లాన్ ను మార్చేసింది. ఎఫ్ 3 సినిమా చేయాల్సి వుంది. కానీ హీరోలు వెంకీ, వరుణ్ ఎప్పటికి అందుబాటులోకి వస్తారో తెలియదు. కరోనా రాకపోయి వుంటే 2021 సంక్రాంతికి సినిమా తెచ్చేయాలనుకున్నారు. విశాఖలో కూర్చుని చాలా వరకు స్క్రిప్ట్ రెడీ చేసారు. మిగిలిన స్క్రిప్ట్ ను అనిల్ తన స్వంత ఊరిలో టీమ్ తో కూర్చుని రెడీ చేసారు. కానీ ఏం లాభం? హీరోలు ఎప్పటికి వస్తారో తెలియదు.
మరోపక్క మహేష్ తో అనిల్ సుంకరకు ఓ సినిమా చేయాల్సి వుంది. అది ఎప్పటికి సాధ్యం అవుతుందో తెలియదు. అందుకే ఈలోగా ఓ చిన్న సినిమాను సరదాగా చేస్తే ఎలా వుంటుందా? అన్న ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. మిడ్ రేంజ్ హీరోలు ఎవరైనా అందుబాటులోకి వస్తే, చకచకా మూడు నెలల్లో ఓ చిన్న సినిమా తీసి పక్కన పెట్టే ఆలోచన అనిల్ రావిపూడికి వుందని తెలుస్తోంది.
నిజానికి ఇది మంచి ఆలోచన కూడా. పెద్ద సినిమాల కోసం ఏళ్లకు ఏళ్లు అలా వెయిట్ చేసే కన్నా, గ్యాప్ దొరికినపుడల్లా మీడియం సినిమాలు కూడా అందిస్తుంటే బాగుంటుంది. గతంలో ఇవివి సత్యనారాయణ ఇలాగే చేసేవారు. ఏ సినిమా దొరికితే ఆ సినిమా లాగించేసేవారు. కానీ ఇప్పుడు హీరో ఎక్కడ ఫీల్ అవుతారో అని డైరక్టర్లు నెలలు కాదు, ఏళ్లు కూడా వృధాగా కూర్చుంటున్నారు. మరి అనిల్ రావిపూడి తన ఆలోచనను ఆచరణలో పెడతారో? లేదో? చూడాలి.