అడ్వాన్స్ లు ఇచ్చి ఇరకాటంలో పడిన ఛానెల్స్

కరోనా దెబ్బ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ పై గట్టిగా పడింది. షూటింగ్స్ నిలిచిపోవడంతో పాటు కీలకమైన నటీనటులు కరోనా బారిన పడ్డారు కూడా. ఇప్పుడిప్పుడే సీరియల్స్ పునఃప్రారంభమైనప్పటికీ.. శాటిలైట్ రైట్స్ పరంగా వైరస్…

కరోనా దెబ్బ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ పై గట్టిగా పడింది. షూటింగ్స్ నిలిచిపోవడంతో పాటు కీలకమైన నటీనటులు కరోనా బారిన పడ్డారు కూడా. ఇప్పుడిప్పుడే సీరియల్స్ పునఃప్రారంభమైనప్పటికీ.. శాటిలైట్ రైట్స్ పరంగా వైరస్ ప్రభావం ఛానెల్స్ పై ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్లానింగ్ ప్రకారం సినిమాల్ని కొనుగోలు చేసిన ఛానెల్స్ అన్నీ ఇప్పుడా సినిమాలు అందుబాటులోకి రాకపోవడంతో లబోదిబోమంటున్నాయి.

ప్రతి ఛానెల్ కు మూవీ టెలికాస్ట్ కు సంబంధించి ఓ షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం సినిమాల శాటిలైట్ రైట్స్ ను వాళ్లు కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు లెక్కప్రకారం ఈ నెలలో టెలికాస్ట్ అవ్వాలి. ఆ మేరకు జెమినీ, స్టార్ మా, జీ తెలుగు సంస్థలు కొన్ని సినిమాల్ని కొనుగోలు చేశాయి కూడా. కానీ కరోనా/లాక్ డౌన్ కారణంగా సదరు సినిమాలు మాత్రం ఇంకా రెడీ కాలేదు. దీంతో ఈ ఛానెళ్లన్నీ మరిన్ని చిక్కుల్లో పడ్డాయి.

జెమినీ ఛానెల్ దాదాపు 10 కొత్త సినిమాలకు అడ్వాన్సులు ఇచ్చింది. అటు స్టార్ మా, జీ తెలుగు ఛానెల్స్ కూడా అటుఇటుగా 5 పెద్ద సినిమాలకు అడ్వాన్సులు ఇచ్చాయి. కానీ ఆ సినిమాలు ఇంకా రెడీ అవ్వలేదు. ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆ సినిమాల షూటింగ్స్ పూర్తవ్వాలి. థియేటర్లలో రిలీజ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఛానెళ్లలో ప్రసారమవ్వాలి.

ప్రస్తుతం ఏ ఛానెల్ దగ్గర కొత్త సినిమాల్లేవు. తమ లైబ్రరీలో ఉన్న మంచి సినిమాల్నే అటుఇటు తిప్పి వేస్తున్నారు. ఆల్రెడీ రిలీజై, శాటిలైట్ కు నోచుకోని చిన్నాచితకా సినిమాలు, ఫ్లాప్ మూవీస్ ఇప్పటికే టీవీల్లో వచ్చేశాయి. కొనడానికి మార్కెట్లో మంచి సినిమాల్లేవు. దీంతో జెమినీ, స్టార్ మా లాంటి ఛానెళ్లు.. డబ్బింగ్ సినిమాలపై పడ్డాయి. తమిళ, మలయాళం భాషల్లో హిట్టయిన సినిమాల డబ్బింగ్ రైట్స్ తీసుకొని, డబ్బింగ్ చేయించి టెలికాస్ట్ చేసే ప్రాసెస్ ను స్టార్ట్ చేశాయి.

ఇలా కరోనా దెబ్బకు ఛానెళ్లన్నీ కుదేలయ్యాయి. ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కు తీసుకోలేక, అలా అని ముందుకు కదల్లేక కిందామీద పడుతున్నాయి. 

చంద్రబాబు స్వయంకృతాపరాధం