కేసీఆర్​ ఏం చేసినా రాజకీయ వ్యూహమే…

తెలంగాణ సీఎం కేసీఆర్​ విలక్షణ రాజకీయ నాయకుడు. ఆయన ఏ పని చేసినా దాని వెనక రాజకీయ వ్యూహం తప్పనిసరిగా ఉంటుంది. రాజకీయ ప్రయోజనం లేకుండా కేసీఆర్​ ఏ పనీ చేయరు. ఇది బీఆర్​ఎస్​…

తెలంగాణ సీఎం కేసీఆర్​ విలక్షణ రాజకీయ నాయకుడు. ఆయన ఏ పని చేసినా దాని వెనక రాజకీయ వ్యూహం తప్పనిసరిగా ఉంటుంది. రాజకీయ ప్రయోజనం లేకుండా కేసీఆర్​ ఏ పనీ చేయరు. ఇది బీఆర్​ఎస్​ నాయకులకు కూడా బాగా తెలుసు. ఆయన పేరుకు ముఖ్యమంత్రేగాని ఆయనలో ఒక నియంత ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఆరు నూరైనా తాను అనుకున్నది చేసి తీరుతాడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు ఎలా పట్టుకోవాలో ఆయనకు బాగా తెలుసు. సమయానుకూలంగా పనులు చేసుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కించాలో, ఎప్పుడు పాతాళానికి తొక్కాలో బాగా తెలుసు.

వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలో ఆయనకు తెలుసు. పరిస్థితులకు అనుగుణంగా ‘కథలు’ చెప్పడం తెలుసు. తనను తాను ఎలా  ప్రమోట్​ చేసుకోవాలో తెలుసు. అందుకే గత పదేళ్లుగా ఆయన జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇందుకు చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఆయన రాజకీయ  వ్యూహానికి తాజా నిదర్శనం గవర్నర్​తో సత్సంబంధాలకు తెర లేపడమే. నిన్నటివరకు గవర్నర్​  తమిళిసైని దూరంగా పెట్టి శత్రువులా చూసిన కేసీఆర్​ ఆమెపై బీజేపీ ఏజెంట్​ అనే ముద్ర కూడా వేశారు. 

ప్రభుత్వం తనను గుర్తించడం లేదని, గవర్నర్‌గా రాజ్యాంగబద్ధ హోదాకు ఇవ్వాల్సిన ప్రొటోకాల్‌నూ ఇవ్వడం లేదని తమిళిసై పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. కనీసం ఒక మహిళకు ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా తనకు ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ తీరుపై ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. జిల్లాలకు వెళ్లినప్పుడు కలెక్టర్‌, అధికారులు తనకు ఇవ్వాల్సిన ప్రొటోకాల్‌ ఇవ్వడం లేదని పలుమార్లు ఆరోపించారు.

ప్రభుత్వం వాహన సదుపాయం కల్పించకపోవడంతో సమ్మక్క, సారలమ్మ జాతరకు ఆమె బస్సులోనే వెళ్లారు. భద్రాద్రిలో వరదల పరిస్థితిని పరిశీలించడానికీ రైల్లోనే వెళ్లారు. కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి కానీ, అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు కానీ తనను ఆహ్వానించలేదని, ఆహ్వానిస్తే వెళ్లేదానినని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. క్యాబినెట్‌, అసెంబ్లీ ఆమోదించిన కొన్ని బిల్లులను తిరస్కరించారు. కొన్నిటిని రాష్ట్రపతికి పంపించారు. ఆర్టీసీ బిల్లును న్యాయ పరిశీలనకు పంపారు. 

దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నియమించే బిల్లును పెండింగులో పెట్టారు. ఇలా.. దాదాపు నాలుగేళ్లుగా గవర్నర్‌, ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది. కానీ, ఇప్పుడు పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఇప్పటి వరకూ రాజ్‌భవన్‌ గడప తొక్కడానికి విముఖత వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు వీలైనంత ఎక్కువ సమయాన్ని అక్కడ గడిపారు. గవర్నర్‌తో ముఖాముఖి సమావేశమయ్యారు.

కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను ఆహ్వానించలేదు. కానీ, సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవానికి ఆమెను ఆహ్వానించారు. ఆమె కూడా పాత విషయాలన్నీ మర్చిపోయి ఆహ్వానాన్ని మన్నించి సచివాలయానికి వెళ్లారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని, ఇప్పుడు గవర్నర్‌తో సఖ్యతకు కూడా కారణం ఇదేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు ఇటీవల వరుసగా జరిగిన పరిణామాలను ఉదాహరిస్తున్నాయి. 

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేసీఆర్‌ తనయ కవిత వ్యవహారం చల్లబడడం.. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించడం, కమ్యూనిస్టులతో పొత్తును కాలదన్నడం, ఇప్పుడు గవర్నర్‌తో సఖ్యత అన్నీ ఒకదానితో మరొకటి లింకున్న అంశాలేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవుల భర్తీకి కేబినెట్ ఆమోదించిన ఫైల్ గవర్నర్ సంతకం కోసం రాజ్ భవన్ లో ఉంది. అలాగే ప్రభుత్వంలో ఆర్​టీసీ  విలీనం పైల్ న్యాయసమీక్షలో ఉంది. ఇవి ప్రభుత్వానికి అత్యంత కీలకం. 

ఎన్నికల షెడ్యూల్ వస్తే.. ఎమ్మెల్సీల ఫైల్ పక్కన పెడితే మళ్లీ తర్వాత వచ్చే ప్రభుత్వమే వాటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇక ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో చేర్చే బిల్లు కూడా  ప్రభుత్వానికి ముఖ్యమే. లొల్లి ఇలాగే కంటిన్యూ అయితే సమస్యలు వస్తాయని కేసీఆర్.. రాజీకి వచ్చినట్లుగా రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. అయితే ఇప్పుడు గవర్నర్ తో మామూలుగా ఉండటం వల్ల.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఏదో ఉందన్న ప్రచారం చేసే వారికి ఈ పరిణామం మరింత  బలం చేకూరుస్తుంది. 

బీఆర్​ఎస్​, బీజేపీ ఒకటేనని, రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్​ పార్టీ ఎప్పటినుంచో ప్రచారం చేస్తోంది. ఆ ప్రచారానికి తగినట్లు పరిణామాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు గవర్నర్​తో సఖ్యత వెనక కేసీఆర్​ రాజకీయ చాణక్యం ఉండే ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కదా. మరి గవర్నర్ కేసీఆర్​ రాజకీయ  వ్యూహాన్ని గ్రహిస్తారా?