ప‌వ‌న్ క‌ల్యాణ్ సింపుల్ గా.. పేరు గొప్ప‌, ఊరు దిబ్బ‌!

పేరు గొప్ప‌, ఊరు దిబ్బ‌.. అనేది చాలా పాత సామెత‌. మ‌రి ఎవ‌రు ఈ మాట ఎందుక‌న్నారో కానీ.. జ‌న‌సేన రాజ‌కీయాన్ని గ‌మ‌నిస్తే ఈ సామెత వంద శాతం మ్యాచ్ అయ్యేలా ఉంటుంది. పార్టీ…

పేరు గొప్ప‌, ఊరు దిబ్బ‌.. అనేది చాలా పాత సామెత‌. మ‌రి ఎవ‌రు ఈ మాట ఎందుక‌న్నారో కానీ.. జ‌న‌సేన రాజ‌కీయాన్ని గ‌మ‌నిస్తే ఈ సామెత వంద శాతం మ్యాచ్ అయ్యేలా ఉంటుంది. పార్టీ పేరు ద‌గ్గ‌ర నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌ల వ‌ర‌కూ అన్నీ గొప్ప‌గానే ఉంటాయి. అయితే ఎటొచ్చీ కార్యాచ‌ర‌ణే ఆ మాట‌ల‌కు త‌గ్గ‌ట్టుగా ఉండ‌దు.

మాట‌లెన్నైనా చెప్పొచ్చు, ఆ మాట‌ల‌కు త‌గ్గ‌ట్టుగా కార్యాచ‌ర‌ణ లేక‌పోతే మాత్రం అంతే సంగ‌తులు! ఆవిర్భావం జ‌రిగి ఎనిమిది సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయినా జ‌న‌సేన వ్య‌వ‌హారం ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏం సాధించ‌నేది కాదు, ఇప్ప‌టికీ జ‌న‌సేన వ్య‌వ‌హారం చుక్కాని లేని నావ‌లాగానే సాగుతూ ఉంది.

జ‌న‌సేన‌.. ఈ పార్టీ వెనుక జ‌నాల్లేరు! మామూలు మ‌హిళ‌లు కాదు, జ‌న‌సేన‌లో ఉన్న‌ది వీర మ‌హిళ‌లే! అయితే మొత్తంగా పార్టీ వ్య‌వ‌హారమే వీర‌త్వంగా క‌నిపించ‌దు! అలాంటి ప్ర‌త్యేకంగా వీర మ‌హిళ‌లు అని ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ప్ర‌సంగాల్లో త‌న మ‌హిళా కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి సంబోధించ‌డం కామెడీగా అనిపిస్తుంది. ఏదో వ్యంగ్యంగా అనిపిస్తుంది.

ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చార వాహ‌నానికి కూడా సామాన్యుల‌కు అంతుబ‌ట్ట‌ని రీతిలో అదేదో పేరు పెట్టారు. మేధావులు, ప‌వ‌న్ క‌ల్యాణ్ లాగా జ్ఞానులు.. ఆ పేరుకు ఏదో భాష్యం చెబుతూ ఉన్నారు. అది సామాన్యుల‌కు అర్థం అయ్యేది కాదు. ఏ త్రివిక్ర‌మ్ లాంటి వాళ్లో త‌మ మేధ‌స్సునంతా ఉప‌యోగించి ఇలాంటి పేర్లు పెడుతూ ఉంటారు. అయితే ఇవ‌న్నీ సామాన్యుల‌కు బోధ‌ప‌డ‌తాయ‌ని కాదు.

ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ ఉద్దేశం ఏమిటో కూడా ప్ర‌జ‌ల‌కు అర్థం కాలేదు. అర్థ‌మ‌య్యింద‌ల్లా జ‌గ‌న్ అంటే ఎందుకో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అస్స‌లు ప‌డ‌దు. చంద్ర‌బాబు అంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ కు వ‌ల్ల‌మాలిన అభిమానం. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న సినీ జీవితాన్ని కానీ అందులోని క‌ల‌ర్ ఫుల్ నెస్ ను కానీ వ‌దులుకోవ‌డానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు. విరామాల్లో రాజ‌కీయం చేస్తే.. త‌న బ‌లాన్ని అతిగా ఊహించుకుంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక పార్ల‌ల్ యూనివ‌ర్స్ లో గ‌డుపుతున్న‌ట్టుగా గ‌డిపిస్తారు. ఇదీ ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయం గురించి ఇప్ప‌టి వ‌ర‌కూ అర్థం అయిన విష‌యం. ఇంత‌కు మించి ప‌వ‌న్ క‌ల్యాణ్ జెండా, అజెండాతో మొద‌లుపెట్టి.. త‌న ప్ర‌చార ర‌థం పేరుతో స‌హా మ‌రేమీ అర్థం కాదు సామాన్యుల‌కు.

కులం పేరు ఎత్త‌నంటాడు, మ‌ళ్లీ కులాన్ని చూసైనా ఓటేయండి, కులాల వారీగా అయినా ఓటేయండంటాడు.  ఏ ఊరు వెళితే ఆ ఊరితో త‌న బీరకాయ పీచు సంబంధం ఏదో అంట‌గ‌డ‌తాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఈ విష‌యం అర్థం అవుతోందో లేదో కానీ.. ఇలాంటి మాట‌లు ఒక రోజు మాట్లాడితే బాగుంటాయి. అయితే ఏ ఊరికి వెళ్లినా ఇలాంటి మాట‌లే ఏవో చెబుతూ ఉంటే అన్ని ఊర్ల వారూ లైట్ తీసుకుంటారు!

త‌న సిద్ధాంతాల‌ను మార్చేసుకోవ‌డంలో వీలైన‌ప్పుడు ఎర్ర‌జెండా, వీలు కాన‌ప్పుడు కాషాయ జెండాను ఎత్తుకోవ‌డం, ఎల్ల‌వేళ‌లా ప‌చ్చ జెండాను మాత్రం మోస్తూ ఉండ‌టం.. ఇదంతా ప్ర‌హ‌సనంగా మారింది. తెలుగు రాజ‌కీయాల్లో ఈ త‌ర‌హా అవ‌కాశ‌వాదాన్ని, అడ్డుగోలు వాదాన్నీ పాటించిన నేత ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రైనా ఉన్నారంటే అది తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు మాత్ర‌మే. ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరు అంత‌కు మించిన రీతిలో సాగుతూ ఉంది.

ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ప్ర‌జ‌లు రాజ‌కీయంగా తిర‌స్క‌రించారు. వ‌చ్చిన నాలుగైదు శాతం ఓట్ల‌ను త‌న ఘ‌న విజ‌యం అనుకుంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ఊహా ప్ర‌పంచం నుంచి బ‌య‌ట‌కురాన‌ట్టే. ఇన్ని మాట‌లు చెప్ప‌క‌పోయినా, అన్ని జెండాలు మార్చ‌క‌పోయినా, కుల రాజ‌కీయం చేయ‌క‌పోయినా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ లా మాస్ హీరో కాక‌పోయినా.. క‌మ‌ల్ హాస‌న్ కు త‌మిళ‌నాడులో ఇంతే స్థాయి ఓట్ల శాతం ద‌క్కింది. అందుకే క‌మ‌ల్ తెలివిగా రాజ‌కీయాల నుంచి ప‌క్క‌కు జ‌రిగాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ లా రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేయ‌డం నవ్వుల పాలే అవుతుంది. కమ‌ల్ కు ఉన్నంత మెచ్యూరిటీ ప‌వ‌న్ కల్యాణ్ లో ఎక్స్ పెక్ట్ చేయ‌డం కూడా పొర‌పాటే అవుతుంది.

ఇంతకీ ప‌వ‌న్ కల్యాణ్ రాజ‌కీయం ఏ తీరం చేరుతుంద‌నేది ఇంకా అంతుబ‌ట్ట‌ని అంశ‌మే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ రెడీగా ఉన్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. తెలుగుదేశం పార్టీతో క‌లిసి కొద్దో గొప్పో సీట్ల‌ను రాబ‌ట్టుకుంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ల‌భించ‌వ‌చ్చు. అది కూడా ఏమంత గొప్ప కాదు. సొంతంగా గెల‌వ‌లేనంత వ‌ర‌కూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ది రాజ‌కీయంగా చేత‌గాని త‌న‌మే అవుతుంది.

వెనుక‌టికి త‌మిళ‌నాట విజ‌య్ కాంత్ సోలోగా త‌ను త‌ప్ప త‌న పార్టీ నుంచి ఎవ్వ‌రినీ గెలిపించుకోలేక‌పోయాడు. ఆ త‌ర్వాత రెండో ఎన్నిక‌ల్లో జ‌య‌ల‌లిత పార్టీతో పొత్తుతో ఎన్నిక‌ల‌కు వెళ్లాడు. ఏకంగా న‌ల‌భై సీట్ల వ‌ర‌కూ వ‌చ్చాయి. అయితే ఆ త‌ర్వాతి ఎన్నిక‌ల్లో స్వ‌యంగా విజ‌య్ కాంత్ కూడా ఎమ్మెల్యేగా నెగ్గ‌లేక‌పోయాడు. మూడో స్థానం లో నిలిచాడు. పొత్తుల కోసం వెంప‌ర్లాడే సినిమా రాజ‌కీయ నేత‌లు గ‌త రెండు ద‌శాబ్దాల రాజ‌కీయాలను గ‌మ‌నిస్తే చాలా పాఠాలే బోధ‌ప‌డ‌తాయి.

సినిమా హీరోల‌ను ప్ర‌జ‌లు రాజ‌కీయంగా నెత్తికెత్తుకునేంత ఆస‌క్తితో లేరు. రాజ‌కీయం వేరు, సినిమా వేరు ఇది ప్ర‌జ‌ల‌కు బాగా తెలుసు. సినిమా హీరోలే ఈ విష‌యాన్ని ఇంకా అర్థం చేసుకోలేక‌పోతున్నారు. సినిమా ర‌చ‌యిత‌ల క్రియేటివిటీని ఉప‌యోగించుకుని పెద్ద పెద్ద పేర్లు, నోరు తిర‌గ‌ని మాట‌లు చెబుతూ రాజ‌కీయంగా కొంత‌మందికి వినోదాన్ని అందిస్తున్నారు ప‌వ‌న్ కల్యాణ్. బ‌హుశా వ‌చ్చే ఎన్నిక‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు క‌ఠిన‌మైన ప‌రీక్ష కూడా. సోలోగా పోటీ చేసినా, తెలుగుదేశం తో జ‌త‌కూడి పోటీ చేసినా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌త్తా అంతా వ‌చ్చే ఎన్నిక‌ల‌తో బ‌య‌ట‌ప‌డుతుంది. అదే ఆఖ‌రు కూడా!

ఎంత పెద్ద విజ‌యం సాధించినా ప‌వ‌న్ రాజ‌కీయ చ‌రిత్ర‌కు వ‌చ్చే ఎన్నిక‌లే ఫైన‌ల్ టెస్ట్. టీడీపీతో జ‌త‌క‌ట్టి సీట్ల‌ను గెలిస్తే.. జ‌న‌సేన‌ను చంద్ర‌బాబే క‌బ‌ళిస్తాడు. ఒక‌వేళ రెండు పార్టీలు జ‌త క‌ట్టి కూడా అనుకున్నంత స్థాయిలో సీట్లు సాధించ‌లేక‌పోతే.. అదే చంద్ర‌బాబే ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ల్ల‌నే ఓట‌మి అంటాడు! ఎలా చూసినా.. చంద్ర‌బాబు ను వెంట పెట్టుకుని రాజ‌కీయంగా ప్ర‌మాద‌క‌ర‌మైన గేమ్ ఆడుతున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్.

హిమ‌