ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లో కోపాన్ని చల్లార్చేందుకు టీడీపీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ సీరియస్‌గా ఆలోచించారు. ఏపీలో మొక్కుబడి పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల తెలంగాణలో 9 వేలకు పైగా పెట్టుబడితో పరిశ్రమ స్థాపించేందుకు కేసీఆర్ సర్కార్‌తో గల్లా జయదేవ్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం వల్లే గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా గ్రూప్… ఏపీకి బదులు పక్క రాష్ట్రంలో వేలాది కోట్ల పెట్టుబడులు పెడుతోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. గల్లా కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా తేనిపల్లి వద్ద రూ.250 కోట్లతో ఆటో బ్యాటరీ విభాగాల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి అమరరాజా గ్రూప్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అమరరాజా పరిశ్రమలున్నాయి. దాదాపు 15 వేల మందికి తమ పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పిస్తున్నట్టు గల్లా జయదేవ్ తెలిపారు. కొత్త పరిశ్రమ ద్వారా 1000 మంది స్థానికులకు ఉపాధి కల్పిస్తామని ఆయన ప్రకటించడం విశేషం.
జగన్ ప్రభుత్వ విద్వేష విధానాల వల్లే తెలంగాణకు అమరరాజా పరిశ్రమ తరలిపోయిందనే టీడీపీ విమర్శలపై ఇంత వరకూ గల్లా జయదేవ్ నోరు మెదపలేదు. పైగా కంటి తుడుపుగానైనా తమకు రాజకీయ భిక్ష పెట్టిన చిత్తూరు జిల్లాలో తాజాగా పరిశ్రమ పెట్టాలని నిర్ణయించుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తమను బద్నాం చేసేలా సాగుతున్న దుష్ప్రచారంపై గల్లా జయదేవ్ మౌనం పాటించడాన్ని ఏపీ ప్రభుత్వ సీరియస్‌గా పరిగణిస్తోందని సమాచారం.
ఈ నేపథ్యంలో కొత్త పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం అంటే ….జగన్ కోపాన్ని చల్లార్చేందుకే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆల్రెడీ ఉన్న పరిశ్రమలు సజావుగా సాగాలంటే ప్రభుత్వంతో మంచిగా నడుచుకోవాల్సిన పరిస్థితి. టీడీపీ ఎంపీగా జయదేవ్ ఉన్నప్పటికీ , జగన్ ప్రభుత్వంపై ఏనాడూ ఆయన విమర్శలకు దిగకపోవడం గమనార్హం.