టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్ మెచ్చకోదగ్గ పని చేస్తున్నారు. అధికారం లేకపోవడం కావచ్చు, తిరిగి దాన్ని దక్కించు కోవాలనే పట్టుదల కావచ్చు… పిలిస్తే పలుకుతాడనే నమ్మకాన్ని సొంత వాళ్లలో కలిగించే ప్రయత్నంలో లోకేశ్ ఓ అడుగు ముందుకేశారు. ప్రతి ఫోన్ కాల్‌ను తానే స్వయంగా రిసీవ్ చేసుకుంటూ, వారు చెప్పింది వినడంతో పాటు తన అభిప్రాయాల్ని ఆయన పంచుకుంటున్నారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకుంది.
మరోవైపు వైసీపీలో సీఎం జగన్ మొదలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు వైసీపీ శ్రేణులకు అందుబాటులో లేరు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది కార్యకర్తలతో నేరుగా మాట్లాడే కార్యక్రమాన్ని సీఎం జగన్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కుప్పం నుంచి ఆయన శ్రీకారం చుట్టారు. అయితే కార్యకర్తల చెప్పింది వినడం పక్కన పెట్టి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని, 175కు 175 సీట్లలో గెలవాలని జగన్ హితబోధతో పాటు దిశానిర్దేశం చేస్తున్నారు. తమ గోడు వినని జగన్ వైఖరిపై వైసీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయనేది వాస్తవం.
సంక్షేమ పథకాలు మినహాయించి చేసుకోడానికి ఏమీ లేదని వైసీపీలో తీవ్ర అసంతృప్తి వుంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులనే జగన్ నమ్ముకున్నారు. తనతో నేరుగా మాట్లాడ్డానికి వారికి పనేం వుండదని, మిగిలిన వర్గాల్లో అసంతృప్తి వున్నా ఏం కాదనే ధీమాలో జగన్ ఉన్నారు. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు లోకేశ్ చొరవ చూపుతున్నారు.
త్వరలో ఆయన పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. అంతకు ముందుగా ముఖ్యంగా టీడీపీ నాయకులు, శ్రేణుల్లో భరోసా నింపేందుకు నేరుగా ఫోన్‌లో మాట్లాడుతుండడంపై ఆ పార్టీలో జోష్ నింపుతోంది. ఎందుకంటే వైసీపీలో ఇలాంటి వాటికి చోటే లేకపోవడం ప్రధాన కారణం. ఔనన్నా, కాదన్నా టీడీపీలో లోకేశ్ శక్తిమంతమైన నాయకుడు. ఆయన ఫోన్ కాల్‌కు అందుబాటులో వుండడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. గ్రామ, మండల స్థాయి నాయకులు లోకేశ్‌కు మెసేజ్‌లు పెట్టడం, మరీ ముఖ్యమైన అవసరమైతే ఫోన్లు చేస్తున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు.
ప్రతి కాల్‌ను లోకేశ్ అటెండ్ చేయడం లేదా మెసేజ్ రూపంలో స్పందిస్తున్నారని చెబుతున్నారు. సమస్య పరిష్కారం సంగతి పక్కన పెడితే తమ నాయకుడితో మాట్లాడుతున్నామన్న సంతోషాన్ని వెల్లడిస్తున్నారు. ఇదే కదా ఎన్నికల సమరానికి శ్రేణులు సమాయత్తం అయ్యేందుకు శక్తినిచ్చేది. ప్రస్తుతం అధికారంలో వైసీపీకి సంబంధించి కనీసం ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులైనా కార్యకర్తలకు పలుకుతున్నారా? అనేది ప్రశ్న.
ఇక సీఎం జగన్ అపాయింట్‌మెంట్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కష్టాల్లో వున్న కార్యకర్తకు నాయకుడి పలకరింపు కొండంత ఊరటనిస్తుంది. లోకేశ్ ఆ ఊరటనిస్తున్నారు. లోకేశ్‌ను తిడుతూ కూచోవడం కంటే, ఆయనలోని ఈ మంచి క్వాలిటీని వైసీపీ నేతలు తీసుకుంటే ప్రయోజనం వుంటుందని చెప్పొచ్చు.