ఇండస్ట్రీలో పూజా హెగ్డే సెంటిమెంట్ ఎవరికి ఉంది? ఈ ప్రశ్నకు ఠక్కున వచ్చే సమాధానం త్రివిక్రమ్. ఒక్క ఈ దర్శకుడికి మాత్రమే పూజా అంటే సెంటిమెంట్ అనుకుంటారంతా. కానీ త్రివిక్రమ్ కంటే ముందే పూజా హెగ్డే ను సెంటిమెంట్ గా ఫీల్ అయ్యే దర్శకుడు ఒకడున్నాడు. అతడే హరీశ్ శంకర్.
అవును.. హరీశ్ శంకర్ కు కూడా పూజాహెగ్డే అంటే చాలా ఇది. తన సినిమాలో పూజా హెగ్డే ఉంటే చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతాడు ఈ దర్శకుడు. దువ్వాడ జగన్నాధమ్ నుంచి హరీష్-పూజా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత గద్దలకొండ గణేశ్ సినిమాలో కూడా పూజానే తీసుకున్నాడు.
ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వంతు వచ్చింది. పవన్ కల్యాణ్ హీరోగా రాబోతున్న ఈ సినిమాలో పూజాహెగ్డేను హరీశ్ శంర్ రిపీట్ చేయగలడా?
పవన్ కల్యాణ్ సినిమాలో పూజాహెగ్డేను తీసుకోవడానికి హరీష్ కు కొన్ని అడ్డంకులున్నాయి. ఒకటి కాల్షీట్ల సమస్య. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో 2 సినిమాలు షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. అటు తమిళ్ లో సూర్య సరసన నటించే అవకాశం ఉంది.
రెండో సమస్య మహేష్-త్రివిక్రమ్ మూవీ. ఈ సినిమాలో నటించడానికి పూజా హెగ్డే ఒప్పుకుంది. కానీ షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వస్తోంది. తాజాగా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ అని ప్రకటించాడు. ఆ సినిమా ఓ కొలిక్కి వచ్చేవరకు, మరో సినిమాకు కాల్షీట్లు సెట్ చేయలేని పరిస్థితి.
ఇక అన్నింటికంటే ప్రధానమైన సమస్య ఇంకోటి ఉంది. పవన్ కల్యాణ్ తో సినిమా అంటే ఎప్పుడు షూటింగ్ ఉంటుందో, ఎప్పుడు వాయిదా పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. పూజాహెగ్డే లాంటి బిజీ హీరోయిన్ ను తీసుకొని, షూటింగ్ వాయిదావేస్తే మళ్లీ ఆమె కాల్షీట్లు పొందడం చాలా కష్టం.
ఇలా హరీశ్ కు, పూజాకు మధ్య చాలా అడ్డంకులున్నాయి. వీటన్నింటినీ క్లియర్ చేసి పూజా హెగ్డేను హరీష్ తన సినిమాలోకి తీసుకొస్తాడా లేక సెంటిమెంట్ ను బ్రేక్ చేసి మరో హీరోయిన్ తో ముందుకెళ్తాడా అనేది చూడాలి.