సాధారణంగా మూడేళ్లలో డిగ్రీ పూర్తి చేస్తారు. కొంతమంది నాలుగైదేళ్లకు గానీ డిగ్రీ పూర్తిచేయరు. అంతకంటే, ఎక్కువ ఏళ్లు డిగ్రీ చేసినోళ్లు కూడా ఉన్నారు. అయితే జాయిసీ డెఫా మాత్రం ఈ విషయంలో రికార్డ్ సృష్టించింది. ఏకంగా 71 ఏళ్ల విరామం తర్వాత డిగ్రీ పూర్తిచేసింది ఈవిడ. ఆ కథేంటో మీరూ చదవండి..
ఎంతోమందిలా జాయిసీ డెఫా కూడా చాలా ఉత్సాహంగా 1951లో కాలేజీలో చేరింది. అమెరికాలోని నార్తర్న్ ఇల్లినాయిస్ యూనివర్సిటీ (ఎన్ఐయు)లో ఆమెకు సీటు వచ్చింది. మూడున్నరేళ్లు బాగానే సాగింది. సరిగ్గా అప్పుడే చర్చిలో డాన్ ఫ్రీమేన్ సీనియర్ ను కలిసింది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు.
ఫ్రీమేన్ ను 1955లో పెళ్లాడింది జాయిసీ. వాళ్లకు ముగ్గురు పిల్లలు పుట్టారు. తర్వాత కొద్దికాలానికి ఫ్రీమేన్ మరణించాడు. ఆ తర్వాత ఐదేళ్లకు రాయ్ డెఫాను పెళ్లాడింది. ఇతడితో ఈమెకు ఆరుగురు పిల్లలు కలిగారు. అలా జాయిసీ కుటుంబం పెరిగి పెద్దదైంది. ప్రస్తుతం ఈమెకు మనవళ్లు, మనవరాళ్లు, మునిమనవళ్లు, మునిమనవరాళ్లు ఇలా అంతా కలిసి 41 మంది ఉన్నారు.
అయితే ఇన్నేళ్లు గడిచినా ఆమె మనసులో చదువు మాత్రం అలానే ఉండిపోయింది. కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేకపోయాననే బాధ ఆమెను వెంటాడింది. ఇదే విషయాన్ని మునిమనవళ్లతో చెప్పుకొని బాధపడింది. దీంతో పిల్లలంతా కలిసి జాయిసీని ప్రోత్సహించారు. వాళ్ల ప్రోత్సహంతో మరోసారి ఎన్ఐయును సంప్రదించింది జాయిసీ.
ఆశ్చర్యకరంగా యూనివర్సిటీ యాజమాన్యం జాయిసీ అడ్మిషన్ ను పునరుద్ధరించింది. అలా 1950ల్లో ఆపేసిన చదువును, తిరిగి మొదలుపెట్టి హోమ్ ఎనకమిక్స్ విభాగంలో డిగ్రీ సంపాదించింది.
డిగ్రీ సాధించే సమయానికి జాయిసీ వయసు అక్షరాలా 90 ఏళ్లు. దీనికోసం ఆమె చాలానే కష్టపడింది. డిగ్రీ పూర్తిచేయడం కోసం తన మునిమనవళ్ల సహాయంతో ల్యాప్ టాప్ ఆపరేట్ చేయడం నేర్చుకుంది. ఆన్ లైన్ లో క్లాసులు పూర్తిచేసింది. అలా 71 ఏళ్ల విరామం తర్వాత డిగ్రీ పూర్తి చేసి తన పట్టుదలను నిరూపించుకుంది జాయిసీ.