ఇండియ‌న్స్ విదేశీయానం.. కోవిడ్ పూర్వ‌పు స్థాయికి!

భార‌త‌దేశం నుంచి విదేశాల‌కు ప్ర‌యాణించే వారి సంఖ్య కోవిడ్-19 పూర్వ‌పు ప‌రిస్థితుల స్థాయిని అందుకుంది. 2020 ఆరంభం నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా విజృంభ‌ణ‌తో విదేశీయానాలు బాగా త‌క్కువ స్ధాయి కి చేరాయి. ప్ర‌పంచం…

భార‌త‌దేశం నుంచి విదేశాల‌కు ప్ర‌యాణించే వారి సంఖ్య కోవిడ్-19 పూర్వ‌పు ప‌రిస్థితుల స్థాయిని అందుకుంది. 2020 ఆరంభం నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా విజృంభ‌ణ‌తో విదేశీయానాలు బాగా త‌క్కువ స్ధాయి కి చేరాయి. ప్ర‌పంచం లాక్ డౌన్ అంటూ తాళాలు వేసుకుంది. 2020 మార్చి-ఏప్రిల్ స‌మ‌యంలో అయితే విదేశీయానం అంటేనే భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత కూడా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌లేదు.

విడ‌త‌లా వారీగా క‌రోనా ప్ర‌భావం తీవ్ర స్థాయిలో క‌నిపించింది. ఎక్క‌డివారు అక్క‌డే ఉండిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం క‌ల్చ‌ర్ అల‌వాటుగా మారిపోయింది. విదేశాల నుంచి వ‌చ్చారంటే వారు ఏ వైర‌స్ ల‌ను తీసుకొచ్చారో..అని అనుమానించాల్సినంత ప‌రిస్థితి గ‌త రెండేళ్ల‌లో ఏర్ప‌డింది. అయితే ఎలాంటి ప‌రిస్థితులకు అయినా ఎదురీద‌డం అల‌వాటుగా చేసుకున్న మ‌నిషి క‌రోనా ప‌రిస్థితుల నుంచి కూడా క్ర‌మంగా బ‌య‌ట‌ప‌డుతున్నాడు. మునుప‌టి స్థాయికి పుంజుకుంటున్నాడు.

ఇందుకు నిద‌ర్శ‌న‌మే.. ఇండియా నుంచి కూడా కోవిడ్ పూర్వ‌పు స్థాయికి పెరిగిన విదేశీ ప్ర‌యాణాలు. 2021 సంవ‌త్స‌రంలో దేశం నుంచి విదేశాల‌కు ప్ర‌యాణించిన వారి సంఖ్య సుమారు 71 ల‌క్ష‌లు. అయితే ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి న‌వంబ‌ర్ ముగిసే నాటికే భార‌త‌దేశం నుంచి సుమారు 1.8 కోట్ల మంది విదేశీ ప్ర‌యాణాలు చేశారు. గ‌త ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విదేశీ యాత్రికుల సంఖ్య సుమారు 137 శాతం పెరిగింది! ఇలా విదేశీయానాల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. కోవిడ్ పూర్వ‌పు స్థితిని అందుకుంది.

ఈ ఏడాది దేశీయ టూరిజం స్థాయి కూడా గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని వివిధ అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. విదేశాల‌కు ప్ర‌యాణాలు చేసిన వారిలో ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఉన్న వారున్నారు. విద్య‌, వ్యాపారం, ఉద్యోగం, విహారం.. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో వీరు విదేశాల‌కు ప్ర‌యాణించారు. వీరిలో అత్య‌ధికంగా అంటే 40 ల‌క్ష‌ల మంది టూరిజం కోసం విదేశీ ప్ర‌యాణాలు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక ఈ సంవ‌త్స‌రం దేశాన్ని పూర్తిగా వ‌దిలి వెళ్లిపోయిన వారు కూడా ఈ కోటీ ఎన‌భై ల‌క్ష‌ల‌మందిలో ఉన్నారు. సుమారు 1.8 ల‌క్ష‌ల‌మంది  ఈ సంవ‌త్స‌రం భార‌త పౌర‌స‌త్వాన్ని వ‌దులుకుని విదేశాలను శాశ్వ‌త ఆవాసాలుగా మార్చుకునేందుకు వెళ్లిపోయిన‌ట్టుగా గ‌ణాంకాలు చెబుతున్నాయి.