సంతోషంగా లేన‌ని ప్ర‌కాశ్‌రాజ్‌కు మంచు రిప్లై

‘మా’ ఎన్నిక‌ల డ్రామా ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ముఖ్యంగా ఓడిపోయిన ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్ నుంచి రాజీనామాల వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఇప్ప‌టికే మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు ‘మా’ స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. తాజాగా…

‘మా’ ఎన్నిక‌ల డ్రామా ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ముఖ్యంగా ఓడిపోయిన ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్ నుంచి రాజీనామాల వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఇప్ప‌టికే మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు ‘మా’ స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. తాజాగా నాగ‌బాబును ప్ర‌కాశ్‌రాజ్ అనుస‌రించ‌డం చర్చనీయంసమైంది.

త‌న రాజీనామా అంశాన్ని ‘మా’ నూత‌న అధ్య‌క్షుడు మంచు విష్ణు దృష్టికి ప్ర‌కాశ్‌రాజ్‌ తీసుకెళ్లారు. ప్ర‌కాశ్‌రాజ్‌కు మంచు విష్ణు నుంచి వెళ్లిన స‌మాధానం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నిన్న‌టి వ‌ర‌కూ ఉప్పునిప్పులా విమ‌ర్శ‌ల‌తో హీటెక్కించిన వారు… నేడు ఎంతో ప్రేమ‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం ఒక వైపు సంతోషం క‌లిగిస్తున్నా, మ‌రోవైపు ఆశ్చ‌ర్యం కూడా.

ముందుగా మంచు విష్ణుకు ప్ర‌కాశ్‌రాజ్ నుంచి వెళ్లిన మెసేజ్ ఏంటంటే…

‘డియర్‌ విష్ణు, ‘మా’ ఎన్నికల్లో నీవు సాధించిన అద్భుత విజయానికి అభినందనలు. ‘మా’ను నడిపించేందుకు అవసరమైన శక్తినంత పొందాలని కోరుకుంటున్నా. ఆల్‌ ది బెస్ట్‌. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. దయచేసి నా నిర్ణయాన్ని ఆమోదించండి. నాన్‌-మెంబర్‌గా నీకు అన్ని విధాలా సాయం చేస్తా.. థ్యాంక్యూ ప్రకాశ్‌రాజ్‌’  అని మెస్సేజ్ పంపారు.

దీనికి మంచు విష్ణు ఎంతో హూందాగా స‌మాధానం ఇచ్చారు.

‘మీరు తీసుకున్న నిర్ణయం పట్ల నేను సంతోషంగా లేను. మీరు నాకంటే పెద్ద వారు. జీవితంలో గెలుపోటములనేవి ఒకే నాణేనికి రెండు వైపులా ఉంటాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. మీరు భావోద్వేగానికి లోనుకావొద్దు. మా కుటుంబలో మీరూ భాగమే. కలిసి పని చేయడానికి మీ ఆలోచనలు మాకు అవసరం. మీరు ఇప్పుడు నాకు సమాధానం ఇవ్వొద్దు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా. అన్ని విషయాలపై చర్చించుకుందాం. లవ్‌ యు అంకుల్‌. దయచేసి తొందరపడొద్దు’ అని విష్ణు పంపారు.

ఈ రెండింటిని స్క్రీన్‌షాట్ తీసి విష్ణు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. విష్ణు రియాక్ట్ అయిన తీరుపై ప్ర‌త్య‌ర్థులు కూడా పాజిటివ్ కామెంట్స్ పెడుతుండ‌డం విశేషం. మ‌రి విష్ణు సానుకూల స్పంద‌న‌తోనైనా ప్ర‌కాశ్‌రాజ్ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటారా లేదా అనే చ‌ర్చ జ‌రుగుతోంది.