తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వరస పెట్టి కుప్పం పర్యటనలు పెట్టుకుంటున్నారు. అక్కడ వచ్చే ఎన్నికల్లో తన సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకోవడానికే చంద్రబాబు నాయుడు ఈ పర్యటనలు చేపడుతున్నారనే అభిప్రాయాలు సహజంగానే వినిపిస్తున్నాయి. క్రితం సారి అసెంబ్లీ ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడు మెజారిటీ చాలా వరకూ కోల్పోయారు. రెండో రౌండ్ కౌంటింగ్ సమయానికి చంద్రబాబు నాయుడు కొన్ని వందల ఓట్ల వెనుకబడ్డారు కూడా!
చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అవుతాడనే ఎన్నికల సమయంలో.. కుప్పంలో ఆయన మెజారిటీ కరిగిపోయింది. మరి వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం తేలికేమీ కాదు. ఇక కుప్పంలో చంద్రబాబు నాయుడు అడ్రస్ గల్లంతు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నట్టుగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కుప్పం ఏరియాలో టీడీపీ మళ్లీ కోలుకోలేకపోవడమే ఇందుకు నిదర్శనం!
ఇటీవలి సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించారు. కుప్పంలో అప్పటికే టీడీపీ కి ఎదురైన ఓటముల నిస్పృహ నుంచి శ్రేణులను బయటపడేసే ప్రయత్నం ఇప్పటికే చేశారు చంద్రబాబు నాయుడు. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితి మారలేదు. చంద్రబాబు నాయుడు తరచూ కుప్పం చుట్టూ తిరుగుతున్నా, ఒక్కో ఎన్నిక జరిగే కొద్దీ కుప్పంలో టీడీపీ కోలుకోవడం మాట అటుంచి, మరింత కుంచించుకుపోతోంది.
చంద్రబాబు నాయుడు రిపేర్లు చేస్తే బాగయ్యే పరిస్థితి లేనట్టుంది అక్కడ. అందులోనూ రెండున్నరేళ్లుగా చంద్రబాబు నాయుడు కేరాఫ్ హైదరాబాద్ గా ఉన్నారు. ఎప్పుడో నెలకూ రెండు నెలలకు ఒకసారి అమరావతి ఏరియాకు వెళ్లడమే ఎక్కువ అన్నట్టుగా ఉంది పరిస్థితి. అమరావతికి వెళ్లడమే అరుదైంది. ఇక కుప్పానికి ఒకటీ రెండు రోజులు వెళ్లి రావడం, అక్కడ గంటా రెండు గంటలు ప్రజల మధ్య గడిపినంత మాత్రానా అద్భుతాలు జరిగపోవు. చంద్రబాబుకు అంత ఛరిష్మా ఎప్పుడూ లేదు కూడా!
అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీరికగా కుప్పానికి వెళ్లొస్తే కథంతా మారిపోయే అవకాశాలు కనిపించడం లేదు. ఎన్నడూ లేని రీతిలో చంద్రబాబు నాయుడుఈ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం వల్ల.. మరింత పలుచనే అవుతున్నారు తప్ప, అంతకు మించి మెరుగయ్యేది లేకుండా పోయింది.
ఇక నుంచి ఎన్నికల వరకూ చంద్రబాబు నాయుడు కుప్పం చుట్టే ప్రదక్షిణలు చేసినా.. అక్కడ గెలుస్తారో లేదో అనేది డౌటే అన్నట్టుగా మారింది పరిస్థితి. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు చేయగలిగినది కుప్పం సీటును తనే వదిలేసుకోవడం. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి కాకుండా మరోసీటు నుంచి పోటీ చేయడం. ఆ మాత్రం భరోసా ఇచ్చే నియోజకవర్గం పై క్లారిటీ వస్తే.. చంద్రబాబే కుప్పానికి గుడ్ బై చెబుతారేమో!