భారతీయుల చూపు విదేశాల మీద ఉంది. ఒక విషయంలో కాదు.. ఒక్క వర్గం అని కాదు! పని చేసే వాళ్లు, పని చేయించే వాళ్లు, చదువుకున్న వాళ్లు, సంపదున్న వాళ్లు.. ఇలా అన్ని వర్గాల్లోనూ విదేశాల వైపు చూసే తత్వం పెంపొందుతూ ఉంది. ఒకవైపు పలు దేశాలు బాగా పని చేసే వాళ్లను, బాగా చదువుకున్న వాళ్లను తమ దేశంలోకి అహ్వానిస్తున్నామని అంటున్నాయి.
అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ధోరణి కనిపిస్తూ ఉంది. ఇక ఇండియా నుంచి బాగా సంపాదించుకున్న వాళ్లు కూడా వలస బాట పడుతున్నారు! వలస అంటే.. అదేదో తిండికి, సంపాదనకూ గతిలేక చేసేది కాదు, చేతినిండా సొమ్ములు ఉన్నవారు కూడా విదేశాలకు వలస బాట పడుతున్నారనేది గమనార్హం.
2014 నుంచి 2018 వరకూ దేశం దాటి విదేశాలకు వెళ్లిపోయిన ధనవంతుల సంఖ్య దాదాపు 23 వేలు! 2020 ఒక్క సంవత్సరంలోనే విదేశీ సిటిజన్ షిప్ తీసుకుని భారతదేశాన్ని వదిలి వెళ్లిపోయిన ధనవంతుల సంఖ్య మరో ఐదు వేలు! ఇది దేశంలోని మిలియనర్ల జనాభాలో రెండు శాతంతో సమానం.
ఒక్క సంవత్సరంలోనే రెండు శాతం మంది ఇండియాను వదిలి బయటకు వెళ్లిపోవడానికి ప్రాధాన్యతను ఇవ్వడం గమనార్హం. ధనవంతులు అయిన భారతీయుల చూపు విదేశాలపై పడిందనే విషయాన్ని చాటుతున్నాయి ఈ గణాంకాలు. ఇలా ఎందుకు దేశం దాటి పోతున్నారు? అంటే.. దానికి అనేక రీజన్లు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.
తమ వ్యాపార అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవడానికి, అలాగే ట్యాక్స్ లు తక్కువగా ఉన్న దేశాల్లోకి వెళ్లడానికి వారు ప్రాధాన్యతను ఇస్తున్నారనేది బాగా వినిపించే మాట. అలాగే కొన్ని దేశాల పాస్ పోర్ట్ కు మంచి వెయిట్ ఉంటుంది. ఉదాహరణకు ఆస్ట్రియా దేశం పాస్ట్ పోర్ట్ చేతిలో ఉంటే 189 దేశాలకు వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చు.
అదే ఇండియా పాస్ పోర్టును కలిగి ఉంటే.. వీసా లేకుండా కేవలం 58 దేశాలకు మాత్రమే వెళ్లగలరు. ఇలాంటి తేడాలు ఉంటాయి. ఆస్ట్రియా, మాల్టా వంటి దేశాల సిటిజన్షిప్ ను కలిగి ఉంటే.. యూరోపియన్ యూనియన్ పరిధిలో ఏ దేశంలో ఉన్నా..ఎవ్వరూ ప్రశ్నించరు!
ఇక దేశం దాటితే చాలా సౌకర్యాలు లభించవచ్చు. అందులో క్వాలిటీ ఎడ్యుకేషన్, బెటర్ హెల్త్ కేర్ ముఖ్యమైనవి. ఈ విభాగాల్లో భారతదేశం ఇప్పటికీ వెనుకబడే ఉంది. అందుకే ధనవంతులు తమ పిల్లలకు మంచి చదువుల కోసం, మెరుగైన జీవితం కోసం విదేశాల్లో సెటిల్ కావడానికి ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారనేది చాలా సులువుగా అర్థం చేసుకోగల అంశం.
ఆస్ట్రియా, మాల్టా, టర్కీ వంటి దేశాల సిటిజన్ షిప్ కోసం భారతీయ మిలియనీర్లు గట్టిగా ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నారు. వ్యాపార అవకాశాల కోసం చూసే వారి లెక్క ఇలా ఉంటే.. ప్రశాంతంగా గడపాలి. ప్రశాంతమైన జీవితం చాలనుకునే వారి చూపు కెనెడ, పోర్చుగల్, ఆస్ట్రియాల మీద ఉందని తెలుస్తోంది. జాత్యాహంకార దాడులు, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటే ప్రశాంత దేశాలు ఇలాంటి వారిని సహజంగానే ఆకర్షిస్తాయి. ఉన్న డబ్బుతో హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేయడానికి వీరు అటు వైపు వెళ్లిపోతున్నారు.
ఒకవైపు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం అనేక మంది దేశం దాటుతున్నారు. అలాంటి అవకాశం వస్తే చాలనే ఎదురుచూపుల్లో ఉన్న వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. ఆఫీసులు పంపిస్తామంటే విదేశాలకు వెళ్లడానికి ఎగిరి గంతేసే పరిస్థితి ఉద్యోగుల్లో ఉంటుంది. ఇక చదువుతో సంబంధం లేకుండా.. గల్ఫ్ దేశాల్లో ఉపాధి మార్గాలను వెతుక్కొంటూ కూడా ఎంతో మంది వెళ్తూ ఉంటారు.
ఇలా సంపాదించుకోవడానికి అనే కారణం చేత వెళ్లే వాళ్ల విషయమే బాగా చర్చకు వస్తూ ఉంటుంది. అలాగే బాగా చదువుకున్న మేధావులు కూడా విదేశీబాట పడుతూ ఉంటారు. బ్రెయిన్ డ్రెయిన్ గా దీన్ని పరిగణిస్తూ.. ఇది దేశానికి నష్టం చేస్తూ ఉంటుందని అనేక మంది బాధపడుతూ ఉంటారు.
చదువు సంధ్యలు కలిగిన వారు, కష్టించి పనిచేసే స్వభావం కలిగిన వారే గాక.. చేతిలో డబ్బు ఉన్న వారు కూడా ఇలా విదేశాల వైపు చూస్తూ ఉన్నారనేది నిష్టూరమైన నిజం. ప్రతి యేటా కొంత శాతం మంది ఇలా విదేశీ బాట పడుతున్నారంటే.. ఇక్కడ పెట్టుబడుల పట్ల కూడా ఎంతో కొంత అనాసక్తి ఉందని చెప్పవచ్చు. దేశ రాజకీయ, సామాజిక పరిస్థితులు కారణంగా కూడా ఉన్న వాళ్లు ఇలా విదేశీ రూటును ఎంచుకుంటూ ఉండవచ్చు.