చింతమనేని 66 నాటౌట్!

తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ బాధితులు పోలిస్ స్టేషన్లకు క్యూ కడుతూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు, చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చింతమనేనిపై ఫిర్యాదులు చేయడానికి వెనుకాడిన వారు ఇప్పుడు ధైర్యంగా బయటకు…

తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ బాధితులు పోలిస్ స్టేషన్లకు క్యూ కడుతూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు, చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చింతమనేనిపై ఫిర్యాదులు చేయడానికి వెనుకాడిన వారు ఇప్పుడు ధైర్యంగా బయటకు వస్తున్నారు. అలాగే పోలీసులు కూడా ఇప్పుడు మొహమాటం లేకుండా కేసులు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

తెలుగుదేశం హయాంలోనే, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చింతమనేని కేసుల విషయంలో హాఫ్ సెంచరీ కొట్టారట. యాభై కేసులు అప్పటికే దాటాయి. ఇక ఇప్పుడు ఊపు చూస్తూ ఉంటే చింతమనేని కేసుల సంఖ్య సెంచరీని దాటేలా ఉందని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతానికి అయితే చింతమనేని అరవై ఆరు నాటౌట్ గా ఉన్నారని తెలుస్తోంది.

ఇప్పటికే కేసుల విచారణలో భాగంగా ఈనెల ఇరవై ఐదు వరకూ చింతమనేనికి రిమాండ్ విధించింది న్యాయస్థానం. మరిన్నికేసులు విచారణకు వస్తే.. ఆయన ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే ఒక కేసులో చింతమనేనికి రెండేళ్లకు మించి జైలు శిక్ష కూడా పడినట్టుంది. దానిపై పై కోర్టులో విచారణ సాగుతూ ఉంది. శిక్ష ఖరారు అయితే.. చింతమనేని రాజకీయం మరోలా ఉండవచ్చు.

ఆ సంగతలా ఉంటే.. తనను జైలు నుంచి, కోర్టుకు తీసుకువెళ్తూ వస్తున్న పోలీసుల మీద చింతమనేని దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిని  'పశువులు' అంటూ దూషించారట చింతమనేని. దీనిపై పోలీసుల సంఘం అధికారులు స్పందించారు. ఇప్పటికైనా చింతమనేని 'మనిషి'లా మారాలంటూ వారు సూచిస్తూ ఉన్నారు. ఇంత జరుగుతున్నా చింతమనేని తీరు మాత్రం మారడం లేదని వారు చెబుతున్నారు.

పీవీపీ వర్సెస్ బండ్ల ఏది నిజం? ఏది అబద్దం?