'మా' ఎన్నికల తర్వాత అంతా బాగానే ఉన్నారు. చిరంజీవి, మంచు విష్ణుకి అభినందనలు తెలిపారు. విష్ణు, ప్రకాష్ రాజ్ ని కౌగిలించుకుని కన్నీరు పెట్టారు. అయితే మధ్యలో నాగబాబు 'మా' సభ్యత్వానికి రాజీనామా చేసి మరోసారి కలకలం రేపారు.
ఎన్నికల వరకే 'మా', ఆ తర్వాత 'మనం' అనుకుంటున్న టైమ్ లో అసలు నాకు, అసోసియేషన్ కి సంబంధం లేదని అలిగారు నాగబాబు. ఎన్నికల్లో అందరూ బాగానే ఉన్నా.. మధ్యలో తాను బకరా అయిపోయానని ఆయన ఫీలవుతున్నారట.
చిరంజీవి నేరుగా తాను ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్నానని చెప్పలేదు. ఓటు వేసొచ్చాక కూడా పవన్ కల్యాణ్ తన మద్దతు ఫలానా వారికి అని నోరు విప్పలేదు. మధ్యలో నాగబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.
పదే పదే ప్రత్యర్థి వర్గానికి కౌంటర్లు ఇస్తూ ప్రకాష్ రాజ్ కి గాడ్ ఫాదర్ లా బిల్డప్ ఇచ్చారు. విష్ణు మాటలకి కనీసం ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ కూడా ఆ స్థాయిలో రియాక్ట్ కాలేదు కానీ నాగబాబు మాత్రం లేని పెద్దరికాన్ని మీదేసుకుని హడావిడి చేశారు, చివరకు 'మా'లో బకరా అయ్యారు.
అప్పుడూ ఇంతే..
గతంలో ప్రజారాజ్యం విషయంలో చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి చాలా వరకు లాభపడ్డారు. కేంద్ర మంత్రి పదవి పొందారు, ఆర్థికంగా కూడా బాగానే గిట్టుబాటైందని అంటారు. అయితే ప్రజారాజ్యం కోసం ఫ్యాన్స్ తో మీటింగ్ లు పెట్టి, పడావిడి చేసి, పార్టీ కోసం పనిచేసిన నాగబాబు చివరకు బకరా అయ్యారు.
కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం వ్యవహారంలో నాగబాబు పాత్రేమీ లేదు, అంతా అల్లు అరవింద్ మైండ్ గేమ్ మాత్రమే. అలా అప్పట్లో ఫ్యాన్స్ ని సిద్ధం చేసి, పార్టీ కోసం పనిచేయించి, చివరకు అన్న చేతులెత్తేసరికి తమ్ముడు బకరా అయిపోయారు.
జనసేన విషయంలో కూడా నాగబాబు బకరానే. పార్టీ కోసం వాడుకున్నన్ని రోజులు వాడుకుని ఆ తర్వాత ఆయన్ని పక్కనపెట్టేశారు. పెత్తనం అంతా నాదెండ్ల మనోహర్ దే.
ఇప్పుడు నాగబాబు ఏదైనా పిలుపునిస్తే చాల్లేవయ్యా ఊరుకో అంటారు జనసైనికులు. కనీసం పార్టీ వ్యవహారాల్లో ఆయన వేలు పెట్టలేరు, ఓ ట్వీట్ కూడా వేయలేని పరిస్థితి. అప్పట్లో అన్నీ తానై చేసి, చివరకు తాను ఎవరికీ కాకుండా పోయారు నాగబాబు.
''మా'' ఆటలో అరటిపండు
ఇప్పుడు 'మా' ఎన్నికల్లో కూడా నాగబాబు ఆటలో అరటిపండుగా మిగిలిపోవడం విశేషం. ప్రకాష్ రాజ్ కే తన మద్దతు అని చిరంజీవి ఎక్కడా బహిరంగంగా చెప్పలేదు. కనీసం పవన్ కల్యాణ్ కూడా ఎక్కడా ప్రకాష్ రాజ్ పేరెత్తలేదు.
ఇద్దరూ కలిసి నాగబాబుతో హడావిడి చేయించారు. అన్న చెప్పాడు, తమ్ముడు కోరుకున్నాడు కదా అని ఊరికి పెద్దలాగా ఆయన పెత్తనం తీసుకున్నారు, మంచు ఫ్యామిలీని అడుగడుగునా అటాక్ చేశారు.
చివరకు ఏమైంది… విష్ణు-ప్రకాష్ రాజ్ కౌగిలించుకున్నారు కానీ.. నాగబాబు ఇప్పట్లో మంచు ఫ్యామిలీతో కలిసే పరిస్థితి లేదు. పైపెచ్చు ఇప్పుడు పూర్తిగా “మా”కు దూరమయ్యే పరిస్థితి వచ్చింది.