మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఊహించని విధంగా ఎన్టీఆర్ పేరు తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిణామాలు నచ్చలేదని, అందుకే నిరసనగా ఓటు వేయనని ఎన్టీఆర్ తనతో చెప్పినట్టు జీవిత రాజశేఖర్ చెప్పుకున్నారు. దీనిపై 3 రోజుల పాటు చాలా చర్చ, ఇంకెంతో రచ్చ జరిగింది. ఓవైపు ఇంత జరిగినప్పటికీ.. ఎన్టీఆర్ మాత్రం పోలింగ్ కు రాలేదు. ఓటు వేయలేదు.
ఎప్పుడైతే ఎన్టీఆర్ పేరు తెరపైకొచ్చిందో ఆ వెంటనే మంచు విష్ణు రియాక్ట్ అయ్యాడు. తను తమ్ముడు తారక్ తో మాట్లాడానని, పోలింగ్ వచ్చి ఓటేస్తానని తనకు మాటిచ్చాడని విష్ణు చెప్పుకున్నాడు. అదే టైమ్ లో ప్రకాష్ రాజ్ కూడా స్పందించాడు.
బంగారంతో తను మాట్లాడానని, ఓటు వేయను అని చెప్పడం తప్పు అని చెప్పానన్నాడు. తనపై ఇంత గందరగోళం నడిచినప్పటికీ, ఎన్టీఆర్ ఎలక్షన్లకు దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నాడు. ఓటు వేసి వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకోలేదు.
ఎన్టీఆర్ తో పాటు మరికొంతమంది ప్రముఖులు కూడా ఓటు వేయలేదు. ముంబయిలో ఉండడం వల్ల ప్రభాస్, స్పెయిన్ వెళ్లడం వల్ల మహేష్ ఓట్లు వేయలేకపోయారు. కానీ హైదరాబాద్ లో ఉండి కూడా ఎన్టీఆర్ ఓటింగ్ కు వెళ్లలేదు.
అసోసియేషన్ ఎన్నికల్లో జరిగిన పరిణామాల సంగతి పక్కనపెడితే.. ఈసారి న్యూట్రల్ గా ఉండాలని నిర్ణయించుకున్నాడు ఎన్టీఆర్. అందుకే మెగా కాంపౌండ్ కు, అటు మోహన్ బాబు కోటరీకి సమదూరం పాటించాడు.
నిజానికి ఎన్టీఆర్ వచ్చి తనకు నచ్చిన వాళ్లకు ఓటు వేయొచ్చు. కానీ అసోసియేషన్ లో స్టార్ హీరోలు ఎవరికి ఓటు వేశారనే విషయం అంతర్గతంగా అందరికీ తెలిసిపోతుంది. అందుకే ఎన్టీఆర్ పూర్తిగా పోలింగ్ కు దూరమయ్యాడు.