గోరంత పని చేసి కొండంత ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకి అలవాటే. కానీ పని చేసి కూడా ప్రచారం లేకుండా చేసుకోవడం ఈమధ్య వైసీపీ నేతలకు కూడా అలవాటైపోయింది.
ఓవైపు టిడ్కో ఇళ్లపై రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అపోహలున్నాయో, ఆరోపణలున్నాయో అందరికీ తెలిసిందే. అయితే నెల్లూరు జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా వెయ్యి మందికి ఇళ్ల తాళాలిచ్చి, పసుపు కుంకుమలిచ్చి గృహప్రవేశాలు చేయించారు. కానీ దానికి తగిన ప్రచారం ఉందా…?
రాష్ట్రవ్యాప్తంగా త్వరలో టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారనే విషయం అర్థమైంది. దీన్నెందుకు సరిగ్గా ప్రచారం చేసుకోవడం లేదు. టీడీపీ మొదలు పెట్టిన ఇళ్లు కదా అని ఉద్దేశ పూర్వకంగానే లో-ప్రొఫైల్ మెయింటెన్ చేస్తున్నారా..? మరి టిడ్కో ఇళ్ల లబ్ధిదారులపై కక్ష సాధింపు అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలు ఎలా తిప్పికొట్టగలరు.. కనీసం ఆలోచించరా..?
ఏపీలో ప్రతిపక్షాల విమర్శలను సరిగా తిప్పి కొట్టడంలో అధికార పక్షం విఫలమవుతుందనే చెప్పాలి. ప్రధానంగా టిడ్కో ఇళ్ల వ్యవహారం వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ నలుగుతూనే ఉంది. వాటికి రంగులు మార్చారని, కొవిడ్ క్వారంటైన్ సెంటర్లుగా మార్చారని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి.
అపార్ట్ మెంట్ల నిర్మాణం పూర్తి చేయకుండా టీడీపీ చేతులెత్తేసిన సంగతి, నిర్మాణాలు పూర్తి కాకముందే రంగులేసి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
వాటిని పూర్తి చేసి బ్యాంకు రుణాలు కూడా తామే చెల్లిస్తామని ఎన్నికలకు ముందు వైసీపీ ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చాక నవరత్నాలపై ఫోకస్ పెట్టారు కానీ దాదాపుగా పూర్తయిన టిడ్కో ఇళ్ల జోలికి మాత్రం ఎవరూ వెళ్లలేదు.
పని చేశారు.. ప్రచారం మరిచారు
ఈ క్రమంలో ఉద్దేశపూర్వకంగానే లబ్ధిదారుల్ని ఇబ్బంది పెడుతున్నారనే ప్రచారం జరిగింది. నిర్మాణం పూర్తయిన అపార్ట్ మెంట్లను ఇవ్వకుండా, జగనన్న కాలనీల పేరుతో వైసీపీ ప్రభుత్వం కొత్త పథకం తీసుకురావడాన్ని చాలామంది విమర్శించారు.
ఈ క్రమంలో అటు జగనన్న కాలనీల పని చూస్తూనే, ఇటు టిడ్కో ఇళ్లను కూడా కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసింది. నెల్లూరు జిల్లాలో తొలిసారిగా వెయ్యి మందికి ఇళ్ల తాళాలు అప్పగించారు.
గత ప్రభుత్వం పేదల వద్ద డబ్బు కట్టించుకుని మోసం చేసినా, తాము మాత్రం ఆ భారం పేదలపై వేయకుండా 7వేల కోట్ల రూపాయలను భరించి నిర్మాణాలు పూర్తి చేశామన్నారు మంత్రి అనిల్.
రాష్ట్రంలో 2లక్షల 62వేల డిట్కో ఇళ్లు సిద్ధం చేశామని ఏడాదిన్నర గడువులోగా అన్ని ఇళ్లు, అందరికీ పంపిణీ పూర్తి చేస్తామని అన్నారు మంత్రి బొత్స సత్యానారాయణ. ఇది ప్రతిపక్షాలకు చెంపపెట్టు కాదా..? మేం కట్టిచ్చిన ఇళ్లు ఆపేశారంటూ దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల నోళ్లు మూయించాలంటే ఇలాంటి వాటిని హైలెట్ చేసుకోవాలి కదా..?
మీడియా మేనేజ్ మెంట్ లో టీడీపీకి తిరుగులేదా..?
వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు సాక్షితోపాటు, సోషల్ మీడియాలో బాగా హడావిడి చేశారు. కానీ అధికారం చేజిక్కిన తర్వాత మాత్రం ఎందుకో సైలెంట్ అయ్యారు.
కానీ దాన్ని పది కాలాలపాటు నిలబెట్టుకోవాలంటే, జగన్ చేస్తున్న పనుల్ని జనాల్లోకి తీసుకెళ్లాలంటే, ప్రతిపక్షాలను నిలువరించాలంటే.. అప్పటి నిబద్ధతను కొనసాగించాల్సిందే. అదే ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా విభాగాల్లో కరువైంది.
అందుకే టిడ్కో ఇళ్లపై ఇంత పెద్ద ముందడుగు పడినా, అది జనాల్లోకి వెళ్లలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో అయినా వైసీపీ అనుబంధ విభాగాల్లో కాస్త చురుకు పుట్టాల్సి ఉంది.