ఆప్ .. పునాదులు ప‌రుచుకుంటున్న‌ట్టేనా..!

గ‌త ద‌శాబ్ద‌కాలంలో కొన్ని రాజ‌కీయ పార్టీలు త‌మ జాతీయ గుర్తింపును కోల్పోయాయి! సీపీఐ, బీఎస్పీ, ఎస్పీ వంటి పార్టీలు గ‌తంలో జాతీయ పార్టీలుగా వ్య‌వ‌హ‌రించ‌గలిగేవి. దేశంలో ఎక్క‌డైనా జాతీయ పార్టీల త‌ర‌ఫున టికెట్ కావాల‌నుకునే…

గ‌త ద‌శాబ్ద‌కాలంలో కొన్ని రాజ‌కీయ పార్టీలు త‌మ జాతీయ గుర్తింపును కోల్పోయాయి! సీపీఐ, బీఎస్పీ, ఎస్పీ వంటి పార్టీలు గ‌తంలో జాతీయ పార్టీలుగా వ్య‌వ‌హ‌రించ‌గలిగేవి. దేశంలో ఎక్క‌డైనా జాతీయ పార్టీల త‌ర‌ఫున టికెట్ కావాల‌నుకునే వారు.. ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీల బీఫామ్ ల‌ను తెచ్చుకునే వారు.

ఉమ్మ‌డి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో.. ఇలాంటి పార్టీల త‌ర‌ఫున నెగ్గిన వారు ఉన్నారు! కేవ‌లం గుర్తు కోసం, జాతీయ పార్టీ త‌ర‌ఫున పోటీ ఉండే సౌల‌భ్యాల కోసం ఇలాంటి పార్టీల బీఫామ్ ల‌ను ఎమ్మెల్యే అభ్య‌ర్థులు తెచ్చుకునే వారు. గెలిచిన త‌ర్వాత వీరికి ఆ పార్టీల‌తో సంబంధాలు కూడా ఉండేవి కావు. ఆ బీఫామ్ ల‌ను కూడా వీరు డ‌బ్బులిచ్చి తెచ్చుకునే వారు అనే పేరుంది.

కేంద్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికారంలోకి వ‌చ్చాకా.. బీజేపీ తామ‌ర‌తంప‌రలా విస్త‌రించడం మొద‌ల‌య్యాకా.. స‌ద‌రు జాతీయ పార్టీలు ఉనికిని కోల్పోయాయి. జాతీయ పార్టీ అనే హోదాను కోల్పోయాయి. ఇక ఇప్పుడు ప్ర‌ధానంగా ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీ ర‌హితం చేయాల‌ని కల‌లు కంటోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ. అయితే ఎనిమిదేళ్ల త‌ర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఒక చోట మునిగినా, మ‌రో చోట లేస్తోంది అది వేరే క‌థ‌.

మ‌రి జాతీయ పార్టీలు ఉనికిని కోల్పోతున్న త‌రుణంలో దేశంలో కొత్త‌గా జాతీయ పార్టీ పుట్టుకొచ్చింది. జాతీయ పార్టీ అంటే..అది తెలుగుదేశం పార్టీ ప్ర‌క‌టించుకున్న‌ట్టుగానో, కేసీఆర్ ముహూర్తం చూసుకుని ప్ర‌క‌టించుకున్న‌ట్టుగానో కాదు సుమా! బుల్లి తెలంగాణ‌కు ప‌రిమితం అయిన టీఆర్ఎస్ ఇప్పుడు త‌న పేరు బీఆర్ఎస్ అంటోంది. మ‌రి ఉప ప్రాంతీయ వాదాన్ని వినిపించిన పార్టీ ఎలా జాతీయ పార్టీ అవుతుంద‌నేది ఇప్ప‌టికీ స‌మాధానం లేని ప్ర‌శ్నే!

ఇక తెలుగుదేశం అయితే ఎప్పుడో జాతీయ పార్టీగా త‌న‌ను తాను ప్ర‌క‌టించేసుకుంది. చంద్ర‌బాబు నాయుడు తెలుగుదేశం జాతీయాధ్య‌క్షుడు! లోకేష్ బాబు ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. ఇలా వీరంద‌రికీ జాతీయ హోదాలే! ఇవ‌న్నీ సొంతంగా జాతీయం చేసుకోబ‌డిన పార్టీలు. అయితే కేంద్రం ఎన్నిక‌ల క‌మిష‌న్ ద్వారా జాతీయ హోదాను సంపాదించుకుంది ఒక పార్టీ. అదే ఆమ్ ఆద్మీ పార్టీ. బీఎస్పీ, ఎస్పీ, సీపీఐలు జాతీయ హోదాను కోల్పోయిన త‌ర్వాత‌.. ఇక జాతీయ పార్టీలు క‌నుమ‌రుగు అవుతున్నాయ‌నుకుంటున్న త‌రుణంలో.. ఒక దేశం, ఒక పార్టీ అన్న‌ట్టుగా కాషాయ వాదులు వాదిస్తున్న త‌రుణంలో ఆప్ జాతీయ గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఇప్ప‌టికీ ఇది గుర్తింపు మాత్ర‌మే!

ఢిల్లీ, పంజాబ్ వంటి చిన్న రాష్ట్రాల్లో అధికారాన్ని క‌లిగి ఉండ‌టం, గుజ‌రాత్ అసెంబ్లీలోకి ఎంట్రీ పాస్ పొంద‌డం, ఆరు శాతానికి మించి ఓటింగ్ పొంద‌డం వంటి సాంకేతిక అర్హ‌త‌ల‌తో ఆప్ జాతీయ పార్టీ అయ్యింది. అంతే కానీ.. జాతీయ వ్యాప్తంగా ఆప్ విస్త‌రించిపోలేదు. అయితే ఒక ద‌శాబ్ద‌కాలంలో ఆప్ సాధించిన గొప్ప ప్ర‌గ‌తే ఇది. దేశ ప్ర‌జ‌ల విశ్వాసాన్ని పొందుతూ ఆప్ ఇప్పుడు జాతీయ పార్టీ అని సీఈసీ వ‌ద్ద గుర్తింపును పొందింది.

కేజ్రీవాల్ పార్టీ పెట్టిన‌ప్పుడు చాలా మంది తేలిక‌గా మాట్లాడారు. తొలిసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి హంగ్ కు కార‌ణమై, ఆ త‌ర్వాత కేజ్రీవాల్ త‌న ప్ర‌భుత్వాన్ని త‌నే ర‌ద్దు చేసుకోవ‌డంతో ఆప్ ను మ‌రింత కామెడీ చేశారు చాలా మంది. కేజ్రీవాల్ ను కించ‌ప‌రిచారు, త‌క్కువ చేసి మాట్లాడారు. అయితే హంగ్ త‌ర‌హా ప‌రిస్థితుల నుంచి ఆప్ ఢిల్లీని ఏక‌ఛ‌త్రాధిప‌త్యం స్థాయిలో ఏలే వ‌ర‌కూ ఎదిగింది.

ప‌క్క‌నే ఉన్న పంజాబ్ లో అధికారాన్ని చేప‌ట్టింది. హ‌ర్యానా విష‌యంలో ఆశాజ‌న‌కంగా ఉంది. గుజ‌రాత్ లో ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా ముందు ముందు మాత్రం ఆప్ సీరియ‌స్ ప్లేయ‌ర్ కాబోతోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును కొంత‌, బీజేపీఓటు బ్యాంకును మ‌రి కొంత చీల్చుకుంటూ ఆప్ నెమ్మ‌దినెమ్మ‌దిగా అయినా పుంజుకుంటోంది. ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదుగుతూ ఉంది. ప‌దేళ్ల కింద‌టితోపోల్చుకుంటే ఇప్పుడు ఆప్ దేశంలో ఒక ప‌రిగ‌ణించ‌ద‌గిన రాజ‌కీయ శ‌క్తే. వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఆప్ ఎలాంటి ప్ర‌భావాన్ని చూప‌గ‌ల‌ద‌నేది మ‌రింత ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం.

గ‌త ఎన్నిక‌ల్లోనే ఆప్ త‌ర‌ఫున చాలా చోట్ల నామినేష‌న్లు అయితే దాఖ‌ల‌య్యాయి. విద్యావంతులు, ఉత్సాహ‌వంతులు న‌గ‌రాల్లో, ప‌ట్ట‌ణాల్లో ఆప్ త‌ర‌ఫున నామినేష‌న్లు వేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆప్ కు లోక్ స‌భ‌లో క‌చ్చితంగా ప్రాతినిధ్యం పెరిగే అవ‌కాశాలే ఉన్నాయి. ఇంత వ‌ర‌కూ రాష్ట్రాల వారీ గా దృష్టి సారించిన ఆప్ లోక్ స‌భ‌లో త‌న బ‌లాన్ని పెంచుకునేందుకు కూడా క‌స‌ర‌త్తులు చేయాల్సి ఉంది. అయితే ఆప్ ప్ర‌ధాన లోపం నాయ‌క‌త్వ‌మే. ఇప్ప‌టికీ కేజ్రీవాల్ ఇమేజ్ మీదే ఆప్ విస్త‌ర‌ణ ఆధార‌ప‌డి ఉంది. రాష్ట్రానికో కేజ్రీవాల్ త‌ర‌హా నాయ‌కుడు ల‌భిస్తే మాత్రం ఆప్ విస్త‌ర‌ణ మ‌రింత వేగవంతం కావొచ్చు.