ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఇప్పుడు రాయలసీమ సందుల్లో అనేకమంది రాజకీయ వారసుల ప్రయాసలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎలాగైనా వారసత్వంగా రాజకీయాన్ని అందుకోవాలంటూ వీరు ఆరాటపడుతూ ఉన్నారు. తండ్రుల, తాతల పేర్లు చెబుతూ.. వారి వలే తాము కూడా రాజకీయంగా సక్సెస్ కావడానికి వీరు ప్రయాసలు పడుతున్నారు. వీరిలో కొందరు గత ఎన్నికల్లోనే పోటీ చేశారు. అయితే ఓటమి ఎదురుకావడంతో.. కనీసం వచ్చే ఎన్నికల్లో అయినా విజయం సాధించి రాజకీయంగా తమ కుటుంబాల ఉనికిని కాపాడుకోవాలని, తమ రాజకీయ భవితవ్యాన్ని అందిపుచ్చుకోవాలని వీరు ప్రయత్నిస్తున్నారు. తరచి చూస్తే ఈ జాబితా పెద్దగానే ఉంది. రాయలసీమలోని పూర్వ నాలుగు జిల్లాల వారీగా చూసుకుంటే.. ముందుగా!
కర్నూలు జిల్లాలో భూమా రాజకీయ వారసులు తమ ఉనికి కోసం ప్రయాస పడుతూ ఉన్నారు. గత ఎన్నికలకు ముందే ఎమ్మెల్యేగా, మంత్రిగా వ్యవహరించిన భూమా అఖిల ప్రియకు ఆళ్లగడ్డలో గత ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. వాస్తవానికి అఖిలప్రియ ఎదుర్కొన్న తొలి ఎన్నిక 2019లోనే. అంతకు ముందు ఈమెది ఏకగ్రీవ ఎన్నిక. తల్లి మరణం తర్వాత అఖిల ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికై..తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రయ్యారు. అయితే ప్రజలు మాత్రం ఈమె రాజకీయాన్ని ఆమోదించలేదు.
ఆళ్లగడ్డలో గత ఎన్నికల్లో ఈమె ప్రత్యక్ష ఎన్నికల పోరాటంలో ఓటమి పాలయ్యారు. అలా ప్రత్యక్ష పోరాటంలో నెగ్గుకు రాలేకపోయిన అఖిలప్రియ వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు సత్తా చూపిస్తుందనేది ఆసక్తిదాయకమైన అంశం. అయితే వచ్చే ఎన్నికల్లో అఖిలప్రియకు చంద్రబాబు టికెట్ కేటాయిస్తారా? అనేది కూడా ప్రశ్నార్థకం అనే వాదనా ఉంది. అయితే అఖిలప్రియ మాత్రం తన ప్రయత్నం తాను గట్టిగా చేస్తున్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ దక్కకపోతే అప్పటికప్పుడు ఏ జనసేనలోనో, బీజేపీలోనో చేరి అయినా అఖిల పోటీకి దిగడం మాత్రం ఖాయం. ఒక రకంగా అఖిలప్రియకు వచ్చే ఎన్నిక అత్యంత కీలకమైనది. వచ్చేసారి ఓడితే మాత్రం రాజకీయంగా ఈమె వెనుకబడిపోవడమే కాదు, ఉనికిలో ఉండటం కూడా కష్టమే!
ఇక ఇదే జిల్లాలో భూమా రాజకీయ వారసుడే మరొకరు రాజకీయ భవితవ్యంగా కోసం ఆరాటపడుతున్నారు. అయనే భూమా బ్రహ్మానందరెడ్డి. భూమా నాగిరెడ్డి స్థానంలో బ్రహ్మానందరెడ్డి నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేశారు. అప్పుడు హోరాహోరీ పోరులో, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంలో బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యే కాగలిగారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం బ్రహ్మం పప్పులు ఉడకలేదు. శిల్పా మోహన్ రెడ్డి తనయుడి చేతిలో భూమా బ్రహ్మం ఓటమిపాలయ్యారు. ఇక వచ్చే ఎన్నికల్లో నంద్యాల టీడీపీ టికెట్ పై బ్రహ్మం ఆశలు గట్టిగా పెట్టుకున్నట్టే. అయితే టికెట్ దక్కుతుందా! అనేది ప్రశ్నార్థకమే. బ్రహ్మానందరెడ్డికి కాకుండా నంద్యాల ఎమ్మెల్యే టికెట్ ను చంద్రబాబు నాయుడు వేరొకరికి కేటాయించే అవకాశాలున్నాయనే వార్తలూ వస్తున్నాయి.
ఇక భూమా కుటుంబం నుంచినే కిషోర్ కుమార్ రెడ్డి అనే ఆశావహుడూ ఉన్నారు. ఈయన ఆళ్లగడ్డ నుంచి టీడీపీ టికెట్ ను ఆశిస్తున్నట్టుగా ఉన్నారని భోగట్టా.
ఇక నంద్యాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా శిల్పా మోహన్ రెడ్డి తనయుడు పోటీలో ఉన్నట్టే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శిల్పా వారసుడు వచ్చే ఎన్నికల్లో నెగ్గితే తన రాజకీయ భవితవ్యాన్ని పదిల పరుచుకున్నట్టే. అలాగే ఆళ్లగడ్డ నుంచి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి కూడా గత ఎన్నికల్లో తొలి సారి నెగ్గారు. వచ్చే ఎన్నికల్లో కూడా గంగుల పోటీలో ఉండే అవకాశమే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి బిజేంద్రనాథ్ రెడ్డి గెలిచినా గంగుల రాజకీయ వారసత్వాన్ని పదిలపరుచుకున్నట్టే అవుతుంది.
ఇక ఈ ప్రాంతానికే చెందిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్రస్తుతానికి నియోజకవర్గం లేని నేత. వ్యక్తిగతంగా పొలిటికల్ గ్లామర్ ను సంపాదించుకున్నా సిద్ధార్థ్ రెడ్డికి ప్రస్తుతానికి అవకాశం లేనట్టే. వీరి సొంత నియోజకవర్గం రిజర్వడ్ గా ఉండటంతో సిద్ధార్థ్ రెడ్డి కి ప్రత్యక్ష పోటీకి అవకాశం లేదు ప్రస్తుతానికి. అయితే సిద్ధార్థ్ రెడ్డి మాత్రం ఇప్పట్లో వెనక్కు తగ్గేలా కూడా లేడు.
ఇక గత ఎన్నికల్లోనే పోటీ చేసి ఓటమి బాట పట్టిన మరో వారసుడు కేఈ శ్యామ్ కుమార్. పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేఈ కృష్ణమూర్తి తనయుడు గత ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ప్రత్యర్థి శ్రీదేవి చేతిలో కేఈ శ్యామ్ చిత్తుగా ఓడిపోయారు. కేఈ రాజకీయ వారసుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీదేవి సుమారు 40 వేలకు పైగా మెజారిటీతో నెగ్గారు. కేఈ కృష్ణమూర్తికి ఎంతో రాజకీయ నేపథ్యం ఉంది. అయితే ఆయన వారసుడు తొలి సారి ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓటమి పాలయ్యారు. అయితే అంతటితో కేఈ శ్యామ్ తన పట్టుదలను విడవకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన పోటీకి దిగే అవకాశాలున్నట్టే. పత్తికొండ నుంచి కేఈ పోటీకి దిగవచ్చు. కేఈ శ్యామ్ కు కూడా వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవి. ఒకవేళ ఓటమి ఎదురైతే మాత్రం వరస ఓటముల నేపథ్యంలో శ్యామ్ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకం కావొచ్చు.
వీరుడు, శూరుడు అనుకున్న జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా పోటీ చేశారు. జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడినా, పవన్ మాట్లాడినా.. ఆ మాటలు కోటలు దాటుతూ ఉంటాయి. అయితే ఎన్ని మాటలు చెప్పినా, ఎన్నికథలు అల్లినా.. పవన్ మాత్రం తొలి సారి ఎన్నికల పోటీలో ఓటమి పాలయ్యారు. ఎంపీగా పోటీ చేసేసి అలవోకగా పార్లమెంట్ లో అడుగుపెట్టాలని తపించిన దివాకర్ రెడ్డి తనయుడికి గర్వాభంగం తప్పలేదు. జిల్లా రాజకీయం అంతా తమ కనుసన్నల్లో నడుస్తోందనేంత స్థాయిలో కలరింగ్ ఇచ్చుకున్నా, పవన్ కు తొలి ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. ఇలాంటి నేపథ్యంలో పవన్ కు వచ్చే ఎన్నికలు చాలా కఠినమైనవి. విశేషం ఏమిటంటే.. పవన్ ఇంతకీ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారా? అనేదికూడా ఇంకా ప్రశ్నార్థకమే!
అన్నింటికీ మించి.. అరివీర భయంకరంగా మాట్లాడుతూ, పవన్ తొలి సారి ఎన్నికల్లో ఓడిపోవడం కామెడీగా నిలిచింది. తనకు జగన్ తో పోటీ అన్నట్టుగా పవన్ మాట్లాడేవాడు. అయితే కనీసం ఎంపీగా నెగ్గలేకపోయిన వైనం ఇతడిని ప్రహసనం పాల్జేసింది.
ఇక జేసీ ఇంటి నుంచినే మరో రాజకీయ వారసుడు కూడా బయల్దేరారు. అతడే జేసీ అస్మిత్ రెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అయిన అస్మిత్ వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు కాబోలు! ఒకవేళ వారసులపై నమ్మకం లేకపోతే ప్రభాకర్ రెడ్డే వచ్చే ఎన్నికల్లో కూడా తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవైపు పవన్ కే ఇంకా ఏ ఊతం లభించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో… అస్మిత్ పరిస్థితి గురించి చర్చకు ఇంకా అంత ఛాన్స్ కూడా లేదు.
ఇక తొలి సారి ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిన మరో తెలుగుదేశం రాజకీయ వారసుడు పరిటాల శ్రీరామ్. కంచుకోట అనుకుని రాప్తాడు నుంచి పరిటాల రవి తనయుడు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. అయితే తొలి సారి ఎన్నికల్లోనే.. ఈయన చిత్తుగా ఓటమి పాలయ్యాడు. వచ్చే ఎన్నికల్లో పోటీకై శ్రీరామ్ ఆరాటపడుతూ ఉన్నాడు. రాప్తాడు నుంచి అవకాశం లభిస్తుందో లేక ధర్మవరం నుంచి అవకాశం దక్కుతుందో కానీ.. శ్రీరామ్ కు కూడా వచ్చే ఎన్నికల్లో అత్యంత కీలకమైనవి. ఏ మాత్రం తేడా కొడితే మాత్రం ఆ తర్వాత చెప్పుకోవడానికి కూడా ఏమీ ఉండదు!
అలాగే పూర్వ అనంతపురం జిల్లా పరిధిలో మరికొందరు రాజకీయ వారసులు ఆరంగేట్రాలకు ఆరాటపడుతూ ఉన్నారు. కల్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి తనయుడు, నిమ్మల కిష్టప్ప వారసులు.. ఇలా అవకాశం కోసం వీరంతా ఎదురుచూస్తున్నట్టుగా ఉన్నారు!
ఎంతెంతో రాజకీయ నేపథ్యం ఉన్న వారు కూడా గత ఎన్నికల్లో కొత్త రాజకీయ పునాదులు వేసుకోవడానికి ఆరాటపడుతూ ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడారు. అలాంటి వారికి వచ్చే ఎన్నికలు చాలా కీలకం. అలాగే మరికొందరు వచ్చే ఎన్నికల్లో తొలిసారి పోటీ ప్రయత్నంలో కూడా ఉన్నారు.
ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వచ్చే ఎన్నికల్లో కొందరు వారసుల ఆరంగేట్రానికి అవకాశం ఉండవచ్చు. అయితే ఇంకా వీరి అవకాశాలు ఖరారు కానట్టే. పూర్వ చిత్తూరు జిల్లా పరిధిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారసుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన తనయుడు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కూతురు.. వీరంతా హడావుడి అయితే చేస్తున్నారు. కానీ వీరికి ఇప్పుడప్పుడే అవకాశాలు లభిస్తాయనే గ్యారెంటీ లేదు. ఇక శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బొజ్జల తనయుడు కూడా తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆరాటపడుతూ ఉన్నారు.
మొత్తానికి వచ్చే ఎన్నికల్లో రాయలసీమ రాజకీయంలో రాజకీయ వారసుల హడావుడి గట్టిగానే ఉండబోతోంది. రాబోవు రాజకీయానికి వీరు వచ్చే ఎన్నికలను ఏ మేరకు ఉపయోగించుకోగలరో అనేది ఆసక్తిదాయకమైన అంశం.