తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ఒక సునామీలాగా విరుచుకుపడుతున్నారు. గులాబీ దళాలకు గుబులు పుట్టిస్తున్నారు. తనకు ఎవ్వరి అండ లేకపోయినా.. తనే సొంతంగా ఒక శక్తిగా ఆవిర్భవిస్తూ ఒంటిచేత్తో పార్టీని ముందుకు తీసుకువెళుతున్నారు.
కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులుగా పరిగణించాల్సిన రేంజిలోకి షర్మిల స్థాపించిన పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ కూడా వచ్చేసిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కమలదళం షర్మిలవైపు శ్రద్ధగా చూస్తోంది. మొన్నటి అరెస్టుల తర్వాత.. ప్రధాని మోడీ షర్మిలకు ఫోను చేసి మాట్లాడారు. ఆమె పార్టీ పురోగమిస్తున్న తీరును బిజెపి సావకాశంగా పరిశీలిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని బిజెపి ఉవ్విళ్లూరుతోంది. అక్కడక్కడా పార్టీ మెరుస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా చూసినప్పుడు అధికారంలోకి వచ్చేంత బలం ప్రస్తుతానికి లేదనేది ఆ పార్టీ నాయకులు కూడా ప్రెవేటు సంభాషణల్లో అంగీకరించే అంశం. అయితే షర్మిల పార్టీతో పొత్తులు పెట్టుకోవడం గానీ, లేదా ఆమె పార్టీని ఏకంగా బిజెపిలో విలీనం చేసుకోవడం ద్వారా గానీ.. కొంత ప్రయోజనం ఉంటుందని కమలదళం అంచనా వేస్తున్నట్టుగా కొన్ని విశ్లేషణలు సాగుతున్నాయి.
షర్మిల బిజెపిలో చేరినా, పొత్తులు పెట్టుకున్నా… తెలంగాణలో అధికార పార్టీకి దీటైన, బలమైన రెడ్డి సామాజిక వర్గం తమ వెంట ఉంటుందనేది వారి అంచనా. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉండగల వైఎస్సార్ అభిమాన గణం ఓట్లు కూడా తమకే వస్తాయని వారి ఆలోచన. ఇదంతా కాంగ్రెస్ ఓటు బ్యాంకును దారుణంగా దెబ్బ కొడుతుంది. ఇలా అనేక రకాల సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని షర్మిల రాజకీయాన్ని బిజెపి శ్రద్ధగా గమనిస్తోంది.
అదేసమయంలో ఎన్డీయేలో భాగస్వామి పార్టీ జనసేన తమతో ఉండాలని బిజెపి నామమాత్రంగా కూడా అనుకోవడం లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. జనసేన వచ్చి ఎక్కడ తమతో పొత్తులకు ప్రయత్నిస్తుందో అని వారు భయపడిపోతున్నారు. పొత్తులు ఉండవు, జనసేన బంధం ఏపీ వరకు మాత్రమే అని పదేపదే అంటున్నారు. నిజానికి అధికారంలోకి రావాలని కలగంటున్న పార్టీ అంతో ఇంతో పవన్ కల్యాణ్ కు ఉండగల ప్రజాదరణను కూడా వాడుకోవాలని లెక్కలు వేసుకోవాలి. కానీ అలా జరగడం లేదు. పవన్ వద్దే వద్దు అన్నట్టుగా వారి రాజకీయ ఎత్తుగడలు సాగుతున్నాయి.
ఈ పరిణామాలు అన్నింటినీ గమనిస్తున్న వారు.. బిజెపి దృష్టిలో షర్మిలకు ఉన్న విలువ పవన్ కల్యాణ్ కు లేకుండా పోయిందా? అని వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కల్యాణ్ మాటల్లో హడావుడి చేయాల్సిందే తప్ప.. నిర్దిష్టంగా కేసీఆర్ పై దమ్ముగా విమర్శలు చేసి ఓట్లు రాబట్టగల నాయకుడు కానే కాదని బిజెపి కూడా గుర్తించేసింది.. అని ఎద్దేవా చేస్తున్నారు.