భారత రాష్ట్ర సమితితో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తానని కేసీఆర్ అంటున్నారు. మోడీ సర్కారును గద్దె దించి.. గులాబీ జెండాను ఎర్ర కోటపై రెపరెపలాడిస్తానని కూడా ఆయన ప్రకటించారు. కిసాన్ సర్కారు వస్తుందని ప్రజలకు మాట ఇచ్చేశారు. కానీ.. జాతీయ స్థాయిలో బిఆర్ఎస్ ప్రస్థానం ఎలా ఉండోబోతంది. ఎలా ఇతర రాష్ట్రాలలో ప్రజాదరణను కూడగట్టుకోబోతోంది. ఇలాంటి అంశాలు ఇప్పటికీ ప్రశ్నార్థకాలే. అయితే ఈ ప్రశ్నలకు కొంతవరకు ఈనెల 14న జవాబు దొరుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
భారాస ఆవిర్భావ కార్యక్రమాన్ని హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన కేసీఆర్ 14న ఢిల్లీలో తమ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా అక్కడే రాజశ్యామల యాగాన్ని కూడా నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి 12వ తేదీనే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారు. మంగళవారం ఆయన అనేక మంది జాతీయ పార్టీల నాయకులను కలిసి తమ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తారు. కేసీఆర్ ఏయే పార్టీల నాయకులను కలవబోతున్నారు, ఆహ్వానించబోతున్నారు, పార్టీని ఇతర నాయకులు ఏ స్థాయిలో గుర్తిస్తున్నారు.. అనేది ఇక్కడే బయటపడుతుంది. ఆయన ఎందరు నాయకులను ఆహ్వానిస్తారో, బిఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎందరు హాజరవుతారో కూడా గమనించాల్సి ఉంది.
కేసీఆర్ తాను కూడా ఒక పార్టీగా చెలామణీ అవుతూ.. దేశంలో ఇతర పార్టీలు అన్నింటినీ కూడగట్టి.. కలిసి ఒక కూటమిగా మోడీ ప్రభుత్వాన్ని పతనం చేద్దాం అని పిలుపు ఇస్తే వచ్చే రెస్సాన్స్ వేరు. అప్పుడు అందరికీ అందులో భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి ఎక్కువమంది పాజిటివ్ గా స్పందించే అవకాశం ఉంది. అలా.. తృతీయ కూటమి ఏర్పాటుకోసం కేసీఆర్ దేశంలోని అనేక రాష్ట్రాలు తిరిగినప్పుడు ఆయనకు పాజిటివ్ గానే స్పందన వచ్చింది.
ఇప్పుడు పరిస్థితి వేరు. ఆయన తాను సొంతంగా జాతీయ పార్టీనే స్థాపించారు. ఎర్రకోటపై తమ పార్టీ జెండా ఎగరేస్తానని అంటున్నారు. మరి ఇలాంటప్పుడు.. ఆయనతో అందరూ మునుపటి స్నేహాన్ని ఎందుకు కొనసాగిస్తారు.
కేసీఆర్ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తే రావొచ్చు గాక.. కానీ తమ రాష్ట్రాల్లోకి కేసీఆర్ వస్తానంటే ఎందుకు ఊరుకుంటారు. ఒప్పుకుంటే.. పొత్తుల రూపంలో తమ సీట్లు కొన్ని బిఆర్ఎస్ కు పంచిపెట్టాల్సి వస్తుంది. ఒప్పుకోకపోతే.. తమ రాష్ట్రంలో కేసీఆర్ ప్రత్యర్థి అవుతారు. ఇలాంటి సమీకరణల నేపథ్యంలో.. ఇతర జాతీయ పార్టీలతో నిన్నటిదాకా ఉన్న బంధానికి ఇవాళ ఉండగల బంధానికి తేడా ఉంటుందని కేసీఆర్ తెలుసుకోవాలి.
ఆధరవుగా ఎవరు దొరికినా చాలు వాడుకుందాం అనే స్థితిలో ఉన్న కర్నాటక లోని కుమారస్వామి పార్టీని ఒప్పించినంత ఈజీ కాదు.. ఉత్తరాదిలోని ఇతర జాతీయ పార్టీలను బిఆర్ఎస్ కు అనుకూలంగా ఒప్పించడం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.