టీటీడీలో సంచలనం చోటు చేసుకుంది. పదవీ విరమణ చేసిన అర్చకులకు తిరిగి విధుల్లోకి తీసుకుంటూ, ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. దీంతో మరోసారి టీటీడీ ప్రధాన అర్చకులుగా రమణదీక్షితులు విధుల్లో చేరనున్నారు. ఆయనతో పాటు పదవీ విరమణ చేసిన అర్చకులకు కూడా అవకాశం దక్కినట్టైంది.
రమణదీక్షితులపై అక్కసుతో చంద్రబాబు ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లుగా నిర్ధారించిందనే ఆరోపణలున్నాయి. 2018, మే 16న అర్చకుల పదవీ విరమణ వయస్సుపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో నాడు 65 ఏళ్లు దాటిన కారణంగా రమణదీక్షితులతో పాటు మరో ముగ్గురు నలుగురు అర్చకులు అర్ధాంతరంగా పదవీ విరమణ చేయాల్సి వచ్చింది.
అప్పట్లో రమణదీక్షితుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి అవమానకర రీతిలో వ్యవహరించాయనే విమర్శలున్నాయి. అర్ధాంతరంగా పదవీ విరమణ చేయిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయంపై రమణదీక్షితులతో పాటు మిగిలిన అర్చకులు 2018లోనే హైకోర్టును ఆశ్రయించారు.
శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న అర్చకులకు వయస్సు మళ్లినప్పటికీ విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పు వెలువరించింది. కానీ నాడు టీటీడీ పాలకమండలి న్యాయస్థానం ఆదేశాలను పాటించలేదు. వయోభారం కారణంగా స్వామివారి కైంకర్యాలు చేయలేరనే ఉద్దేశంతో కోర్టు తీర్పును అమలు చేయకుండా పక్కన పెట్టేసింది.
జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రమణదీక్షితులు ఆగమశాస్త్ర సలహాదారుగా టీటీడీలో అడుగు పెట్టారు. అయితే ఆయన మనసంతా దేవదేవునికి సేవ చేసుకోవాలనే ఉంది. ఈ నేపథ్యంలో పదవీ విరమణ చేసిన అర్చకుల ఆకాంక్షలకు అనుగుణంగా టీటీడీ పాలకమండలి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.