విశాఖ ప్రజల చిరకాల వాంచ. ఈ మహానగరం రాజధాని కావాలని, అసలు తెలంగాణా ఉద్యమం మొదలైన తరువాత నుంచే విశాఖ మన కొత్త రాజధాని ఆశలు పెంచుకున్నారు. కానీ 2014 తరువాత సీన్ రివర్స్ అయింది. జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ప్రతిపాదనలు తెచ్చారు. విశాఖను పాలనారాజధాని చేస్తామని కూడా ప్రకటించారు. మొదట్లో కొంత హడావుడి చేసిన విశాఖ తమ్ముళ్ళు తరువాత చడీ చప్పుడు చేయలేదు, ఇపుడు చూస్తే విశాఖకు రాజధాని వచ్చేసింది.
దాంతో విశాఖ సిటీ నుంచి గెలిచిన నలురుగు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మౌనమే మా సమాధానం అంటున్నారు. అంటే అదే అర్ధాంగీకారమో పూర్తి అంగీకారమో ఎవరి అర్ధాలు వారు చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఇంకో వైపు చూసుకుంటే అయ్యన్నపాత్రుడు, సీనియర్ మోస్ట్ తెలుగుదేశం పార్టీ లీడర్. మంత్రుగా అనేక కీలకమైన శాఖలను నిర్వహించారు. ఆయన గతంలో విశాఖ రాజధాని ఎవరూ కోరుకోవడంలేదని అన్నారు.
తీరా ఇపుడు మూడు రాజధానులు అయ్యాయి. అంతే కాదు, విశాఖ పాలనారాజధానిగా మారబోంది. కానీ దాని మీద ఇపుడు అయ్యన్నతో సహా టీడీపీ నేతలు ఎవరూ స్పందించడానికి కూడా సిధ్ధంగా లేనట్లుగా ఉంది. ఎక్కడో అయోధ్యలో రామాలయం నిర్మాణం చేస్తున్నారని హర్షం వ్యక్తం చేసిన అయ్యన్న విశాఖ రాజధాని గురించి వ్యతిరేకంగా ఒక్క మాటా అనకపోవడం విశేషమే.
మరో వైపు బీజేపీలో చూస్తే ఏకంగా విశాఖ నగర అధ్యక్షుడే విశాఖ రాజధాని మా ప్రతిపాదనే అని సొంతం చేసుకోవడానికి చూడడం విడ్డూరమే. మాకు అమరావతి మాత్రమే రాజధాని అని బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు చెప్పినా కూడా ప్రాంతీయ అభిమానంతో ఆయన ప్రకటించారనుకోవాలి. ఇక టీడీపీ, బీజేపీ సహా అన్ని రాజకీయ పక్షాలు విశాఖ రాజధాని ప్రకటన మీద లోలోపల మద్దతుగానే ఉండడం విశేషం. చంద్రబాబుకు విశాఖ రాజధాని ప్రకటన దుర్దినం, చీకటి రోజు అయి ఉండవచ్చు కానీ విశాఖ జనం ఓట్లతో గెలిచిన తమ్ముళ్ళు ఆ మాట బయటకు అనలేరుగా. అందుకే మౌనంగానే విశాఖ రాజధానికి మద్దతు ఇస్తున్నటుగా ఉంది.