సినిమా రంగంలో తిరుగులేని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా పేరుంది దిల్ రాజుకు. ఆయన వెనుక ఎలా మాట్లాడినా ఆయన ముందు మాత్రం 'జీ' అంటే 'జీ' అంటూనే వుంటారు. ఆయనతో అవసరాలు అలాంటివి. తెరవెనుక మాత్రం ఆఫ్ ది రికార్డుగా ఆయనపై గుస్సాయిస్తుంటారు.
వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తూ, ఆ మధ్య కొందరు నిర్మాతలకు ఫండింగ్ చేస్తూ, చిన్న సినిమాలు నిర్మించాలని భారీ ప్రణాళిక కూడా ఆవిష్కరించారు. కానీ ఇప్పడు పరిస్థితి మారుతోంది. చూస్తుంటే దిల్ రాజుకే సినిమాలు కరువయ్యేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు ఇప్పట్లో దిల్ రాజు బ్యానర్ లో వుండేలా లేవు. ఇప్పటికే థియేటర్ల వ్యాపారం తాత్కాలికంగా ఆగిపోయింది. డిస్ట్రిబ్యూషన్ కు బ్రేక్ పడింది. నిర్మాణాలు అయినా స్టార్ట్ చేసి, ముందుకు వెళ్దాం అనుకుంటే ఒక్కో హీరో పక్కకు తప్పుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ప్రభాస్ కు సాహో విడుదల టైమ్ లో అన్ని విధాలా ఆదుకున్నారు. డేట్ లు తీసుకున్నారు. కానీ సినిమా ఎప్పుడు వుంటుందో తెలియదు. ఎందుకంటే అశ్వనీదత్ కు డేట్ లు ఇచ్చారు. ఆ తరువాత బాలీవుడ్ ప్రాజెక్టుల ఓకె చేసారు.
బన్నీ సినిమా అనౌన్స్ అయింది కానీ అలా అబేయన్స్ లో వుంది. బన్నీ బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు ఫిక్స్ అయిపోయాడు. సుకుమార్, కొరటాల శివ, త్రివిక్రమ్ లతో సినిమాలు చేయాలి.
ఓ మిడ్ రేంజ్ హీరోతో, ఇంద్రగంటి డైరక్షన్ లో సినిమా అనుకున్నారు కానీ, ఆ సినిమా కూడా వుంటుందా? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు-వంశీ పైడిపల్లి సినిమా అనుకున్నారు అది కాస్తా అలా వుండిపోయింది. మహేష్ ఎలాగైనా ఓ సినిమా త్రివిక్రమ్ తో చేయాలని తెగ ప్రయత్నిస్తున్నారని బోగట్టా. అది కాకుండా అనిల్ రావిపూడి సినిమా ఒకటి వుండనే వుంది. అది అనిల్ సుంకర నిర్మాతగా. ఆ విధంగా మహేష్ సినిమా కూడా ఇప్పట్లో వుండేలా లేదు.
ఎన్టీఆర్ కమిట్ మెంట్లు ఆయనకు వున్నాయి. ఆయన కూడా ఇప్పట్లో దిల్ రాజుతో సినిమా చేసే అవకాశం లేనట్లే.
ఒక్క రామ్ చరణ్ మాత్రమే ఆశాకిరణంగా వున్నారు. అది కూడా సరైన డైరక్టర్ ను, కథను తీసుకెళ్తే. లేదూ అంటే ఇక దిల్ రాజు టైర్ 2, 3 హీరోలతో సినిమాలు ప్లాన్ చేసుకోవాల్సిందే.