మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, ప్రసాద్ స్టూడియో వ్యవస్థాపకుడు ఎల్వీ ప్రసాద్ మనవడి మధ్య తకరారు మరోసారి తెరపైకి వచ్చింది. దీనికి ఎల్వీ ప్రసాద్ స్టూడియోలో ఓ ప్రాపర్టీ కారణం. ప్రస్తుతం వారిద్దరి మధ్య గొడవ వ్యవహారం పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు దారి తీసింది. ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్‌పై ఇళయరాజ చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది
కొంత కాలంగా వాళ్లిద్దరి మధ్య నడుస్తున్న వివాదం…మరింత రాజుకుంది. ప్రసాద్ స్టూడియో వ్యవస్థాపకుడు ఎల్వీ ప్రసాద్‌కు సంగీత దర్శకుడు ఇళయారాజా సంగీతం అంటే ఎంతో ఇష్టం. ఇళయరాజాపై ఆ గౌరవంతో ఎల్వీ ప్రసాద్ తన స్టూడియోలో ఓ ప్రత్యేక గదిని కానుకగా ఇచ్చారు. ఈ రికార్డింగ్ స్టూడియోలో 40 ఏళ్లుగా ఇళయరాజా సంగీత కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
ఎల్వీ ప్రసాద్ తనయుడు ఎల్వీ రమేశ్ ప్రసాద్ కూడా ఇళయరాజాపై తండ్రి మాదిరిగానే గౌరవాన్ని ప్రదర్శించారు. దీంతో ఎలాంటి సమస్యలు లేకుండా దశాబ్దాల తరబడి ఇళయరాజా తన సంగీత కార్యకలాపాలను అక్కడి నుంచే యథేచ్ఛగా కొనసాగిస్తు న్నారు. కానీ ఎల్వీ ప్రసాద్ మనవడు సాయిప్రసాద్ అడ్డు చెప్పారు. దీంతో సమస్య తలెత్తింది. ఇళయరాజా వాడుకుంటున్న గది (సంగీత స్టూడియో) తనదే అని సాయిప్రసాద్ వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గదిని ఖాళీ చేయాలని ఒత్తిడి తేవడం స్టార్ట్ చేశారు. దీంతో ఇళయరాజా న్యాయం కోసం కోర్టు మెట్లెక్కారు. ప్రస్తుతం అక్కడ విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన గదిని ఆక్రమించుకోడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రసాద్ స్టూడియోలోని తన సూట్లోకి ప్రవేశించి సంగీత వాయిద్యాలు, నోట్లు, ఇతర పరికరాలను ధ్వంసం చేశారని చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఇళయరాజా తరపున ఆయన మేనేజర్ జాఫర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇళయరాజాని సాయి మనుషులు బెదిరించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
న్యాయస్థానంలో కేసు విచారణలో ఉండగానే, తనపై దౌర్జన్యం చేయడంతో పాటు సంగీత కార్యకలాపాలు నిర్వహించే తన స్టూడియోని ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారని, తన కార్యకలాపాలకు అడ్డొస్తున్నారని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇళయరాజా డిమాండ్ చేశారు. చివరికి ఇది ఏ మలుపు తీసుకుంటుందోననే ఆందోళన నెలకొంది.