రాజ్ తరుణ్ కెరీర్ లో ఓ రిమార్క్ ఉంది. ఓ నిర్మాత ఇచ్చిన విల్లాకు ఆశపడి, అతడు బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు అదే నిర్మాతతో చేశాడు. ఆ 3 సినిమాల్లో ఏదీ హిట్టవ్వలేదు. దీనిపై రాజ్ తరుణ్ స్పందించాడు. విల్లాకు ఆశపడి 3 సినిమాలు చేయలేదంటున్నాడు ఈ హీరో. తను 3 సినిమాలు చేసే క్రమంలో విల్లా వచ్చిందని చెబుతున్నాడు.
“విల్లా ఇస్తారని ఆశపడి 3 సినిమాలు చేయలేదు. అనీల్ సుంకర నాకు విల్లా ఆఫర్ ఇవ్వలేదు. నిజానికి ఆ విల్లా తీసుకునే టైమ్ కి 3 సినిమాలూ సెట్స్ పై ఉన్నాయి. అప్పటికే నేను కొంత రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నాను. డబ్బులిస్తే నేను వెంటనే ఖర్చు పెట్టేస్తున్నానని రాజా రవీంద్ర అలా సెట్ చేశారు. అనీల్ సుంకర తో ముందు ఒక సినిమానే అనుకున్నాం. ఆ సినిమా సెట్స్ పై ఉంటుండగానే, వరుసగా మరో 2 కథలొచ్చాయి. అవి కూడా తనే చేస్తానన్నారు అనీల్ సుంకర. ఆ టైమ్ లో ఒకేసారి ఎక్కువ డబ్బు వస్తే నేను ఖర్చుపెట్టేస్తానని, అనీల్ సుంకరతో నాకు విల్లా ఇప్పించాడు రాజారవీంద్ర. విల్లా కోసం ఆ 3 సినిమాలు చేయలేదు. ఆ సినిమాలు చేసే క్రమంలో విల్లా వచ్చింది. ఇప్పుడు ఆ విల్లాలోనే ఉంటున్నాను.”
ఇలా తనపై ఉన్న విమర్శకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు రాజ్ తరుణ్. అనీల్ సుంకర నిర్మాతగా అతడు చేసిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, రాజుగాడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మరోవైపు తన కెరీర్ పై రాజారవీంద్ర ప్రభావం ఎక్కువగా ఉందనే విమర్శల్ని కూడా ఈ హీరో తిప్పికొట్టాడు.
“కథల విషయంలో రాజారవీంద్ర పాత్ర ఉండదు. నేనే వింటాను, నేనే ఫైనల్ చేస్తాను. ఇద్దరం కలిసి కథలు విన్నప్పుడు కూడా ఆయన కామ్ గానే ఉంటారు. నాకు నచ్చింది అన్నానంటే ఆయనింకేం మాట్లాడరు. కాకపోతే నాకు ఓ కథ నచ్చింది అని చెప్పినప్పుడు దాన్ని మరింత బెటర్ చేయడానికి సలహాలు ఇస్తుంటారు. ఇప్పటివరకు నేను కాస్త డైలమాలో ఉండి రాజారవీంద్రను సలహా అడిగిన సందర్భాలు 2సార్లు మాత్రమే.”
అనీల్ సుంకరతో ఆ 3 సినిమాలు చేస్తున్న టైమ్ లో ఓ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్నాడు రాజ్ తరుణ్. అదే శతమానంభవతి. అప్పటికే 3 సినిమాలు మధ్యలో ఉన్నాయని, శతమానంభవతికి టైమ్ కేటాయించలేకపోయానని అన్నాడు.