వారెవ్వా…తెర వెన‌క న‌ట‌న‌లో జీవించారే!

తెర‌పైనే కాదు తెర వెనక అంత‌కంటే అద్భుతంగా తాము న‌టించ‌డం కాదు జీవించ‌గ‌ల‌మ‌ని టాలీవుడ్ న‌టులు నిరూపించారు. ‘మా’ ఎన్నిక‌ల పుణ్య‌మా అని సినీ సెల‌బ్రిటీల నట‌నా కౌశ‌ల్యం బ‌య‌ట‌ప‌డింది. ‘మా’ ఎన్నిక‌లు టాలీవుడ్‌ను…

తెర‌పైనే కాదు తెర వెనక అంత‌కంటే అద్భుతంగా తాము న‌టించ‌డం కాదు జీవించ‌గ‌ల‌మ‌ని టాలీవుడ్ న‌టులు నిరూపించారు. ‘మా’ ఎన్నిక‌ల పుణ్య‌మా అని సినీ సెల‌బ్రిటీల నట‌నా కౌశ‌ల్యం బ‌య‌ట‌ప‌డింది. ‘మా’ ఎన్నిక‌లు టాలీవుడ్‌ను రెండుగా చీల్చిం ద‌నే ఆవేద‌న సినీ పెద్ద‌ల్లో క‌నిపించింది. నిన్న‌టి వ‌ర‌కూ ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు, దూష‌ణ‌ల‌తో ర‌చ్చ‌ర‌చ్చ చేశారు. చివ‌రికి సొంత రంగానికి చెందిన వాళ్లే, త‌మ న‌టుల ప్ర‌వ‌ర్త‌న‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం చూశాం.

ఇవాళ ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లు కాగానే, స‌రికొత్త చిత్రం ఆవిష్కృత‌మైంది. నిన్న‌టి వ‌ర‌కూ ప్ర‌కాశ్‌రాజ్ పేరు ఎత్త‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని మంచు విష్ణు, ఆయ‌న్ను కౌగ‌లించుకోవ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అలాగే మంచు మోహ‌న్‌బాబు ఆశీస్సులు తీసుకునేందుకు ప్ర‌కాశ్‌రాజ్ పాదాభివంద‌నం చేయాల‌నే ప్ర‌య‌త్నం క‌ళ్ల‌కు క‌ట్టింది. ఆ ప్ర‌య‌త్నాన్ని మంచు మోహ‌న్‌బాబు వారించి, త‌న కుమారుడితో షేక్ హ్యాండ్ ఇప్పించ‌డం ‘మా’ ఎన్నిక‌ల ఎపిసోడ్‌లో ట్విస్ట్.

ప్ర‌ధానంగా ఈ ఎన్నిక‌లు మెగా ఫ్యామిలీ వ‌ర్సెస్ మంచు ఫ్యామిలీ అన్న రీతిలో సాగాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఓటింగ్‌కు రాగానే మంచు మోహ‌న్‌బాబు ఆప్యాయంగా ప‌ల‌క‌రించిన దృశ్యం ఆక‌ర్షించింది. అలాగే మంచు మ‌నోజ్‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆప్యాయంగా మ‌స‌లు కోవ‌డం చర్చ‌నీయాంశ‌మైంది. రామ్‌చ‌ర‌ణ్‌, మంచు విష్ణు ప‌ర‌స్ప‌రం ప‌ల‌క‌రించుకోవ‌డం, స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకోవ‌డం బిగ్‌బ్రేకింగ్ న్యూస్ అయ్యింది.

ఇంత కాలం ఎవ‌రైతే వ‌ర్గాలుగా విడిపోయి దూషించుకున్న వాళ్లే… తాజాగా ఎన్నిక‌ల కేంద్రం వ‌ద్ద ఆలింగ‌నాలు చేసుకోవ‌డంతో ఇరు ప్యాన‌ళ్ల‌లోని స‌భ్యులు అవాక్క‌య్యారు. క‌డుపులో క‌త్తులు పెట్టుకుని, పైకి మాత్రం ఆప్యాయత‌లు క‌న‌బ‌ర‌చ‌డం ఈ న‌టుల‌కే చెల్లింద‌ని సామాన్య జ‌నాభిప్రాయం. వారెవ్వా…ఏం న‌టించార‌య్యా అని జ‌నం చ‌ర్చించుకుంటున్నారు.