ప్రతిష్టాత్మకంగా జరిగిన ‘మా’ ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘మా’ ఎన్నికల్లో సినీ సెలబ్రిటీలు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపారు. రికార్డు స్థాయిలో 83 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఓటింగ్ నమోదును బట్టి మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్ ప్యానళ్లు ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తీసుకురావడంతో సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)ఎన్నికలు షెడ్యూల్ కంటే ఒక గంట పొడిగించారు. అంటే 3 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. మా’లో మొత్తం 925 మంది సభ్యులుగా ఉన్నారు. వీరిలో 883 మందికి ఓటు హక్కు ఉంది. పోస్టల్ బ్యాలెట్లతో కలిపి మొత్తం 626 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
ఇదిలా వుండగా సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అత్యధికంగా ఓటు హక్కు వినియో గించడంపై ఇరు ప్యానళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
తమకంటే తమకు అనుకూలంగా ఓటింగ్ జరిగిందని రెండు ప్యానళ్ల సభ్యులు ప్రకటిస్తుండడం విశేషం. గెలుపుపై ఇరు ప్యానళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రాత్రి 11 గంటలకల్లా తుది ఫలితం తేలుతుందని చెబుతున్నారు. అంత వరకూ ఉత్కంఠ తప్పదు.