ఓవైపు జనం అంతా మా ఎన్నికల పోలింగ్, వివాదాలపై సీరియస్ గా దృష్టి పెట్టిన వేళ.. సైలెంట్ గా తన ప్రేమ సంగతి బయటపెట్టింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో రిలేషన్ షిప్ లో ఉన్న విషయాన్ని ఈరోజు అధికారికంగా బయటపెట్టింది.
ఈరోజు రకుల్ ప్రీత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు జాకీ భగ్నానీ. “నువ్వు లేకపోతే రోజు రోజులా గడవదు. భోజనం సహించదు. నువ్వే నా ప్రపంచం. హ్యాపీ బర్త్ డే మై లవ్” అంటూ రకుల్ కు శుభాకాంక్షలు చెప్పాడు జాకీ.
ఆ వెంటనే రకుల్ స్పందించింది. జాకీకి థ్యాంక్స్ చెబుతూనే.. ఈ ఏడాది జాకీనే తన పెద్ద గిఫ్ట్ అని ప్రకటించింది. తనను నిత్యం నవ్విస్తూ, జీవితాన్ని రంగులమయం చేసిన జాకీకి సోషల్ మీడియా వేదికగా లవ్ ఎమోజీతో ప్రేమను వ్యక్తం చేసింది. కలిసి మరిన్ని జ్ఞాపకాల్ని సొంతం చేసుకుందాం అని కూడా రాసుకొచ్చింది.
ఇన్నాళ్లూ తన ప్రేమ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచింది రకుల్. లాక్ డౌన్ టైమ్ లో కూడా ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లకుండా ముంబయిలోనే ఎందుకు ఉండిపోయిందో ఇప్పుడు అందరికీ అర్థమైంది. నిజంగా ఈ సోషల్ మీడియా యుగంలో ప్రేమ విషయాన్ని ఇంత గోప్యంగా ఉంచడం గొప్ప విషయమే.
వీళ్లిద్దరి రిలేషన్ షిప్ గురించి తెలిసిన వెంటనే కాజల్, రాశిఖన్నా, ప్రగ్యా జైశ్వాల్, ఆయుష్మాన్ ఖురానా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కృతి సనన్ లాంటి ఎంతోమంది ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సో.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది మన ఓబులమ్మ.